ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు

ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు
 
దేశవ్యాప్తంగా రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ‘స్వర్ణిమ్‌ భారత్‌, విరాసత్‌ ఔర్‌ వికాస్‌’ అనే థీమ్‌తో పలు శకటాలను రూపొందించారు. ఈ వేడుకల్లో బ్రహ్మాస్‌, ఆకాశ్‌ క్షిపణులతోపాటు పినపాక మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ లాంఛర్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిలిటరీ కవాతులో త్రివిధ దళాలు తమ సత్తా చాటాయి. కర్తవ్యపథ్‌ లో తొమ్మిది కిలోమీటర్ల మేర ఈ కవాతు కొనసాగింది.

వేడుకల్లో భాగంగా ఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుబియాంతో ప్రత్యేక గుర్రపు బండిలో వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం వారు సైనిక దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా 300 మంది కళాకారుల బృందం వివిధ రకాల దేశీయ వాయిద్యాలతో ‘సారే జహాసే అచ్చా’ గీతాన్ని వాయించారు. అనంతరం హెలికాప్టర్‌లు ఆకాశం నుంచి పూల వర్షం కురిపించాయి. గ్రూప్‌ కెప్టెన్‌ అలోక్‌ అహ్లావత్‌ దీనికి నాయకత్వం వహించారు. ఇండోనేషియాకు చెందిన నేషనల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ నుంచి 152 మంది బృందం ఈ కవాతులో పాల్గొన్నది. మరో 190 మంది సభ్యుల బృంధం మార్చ్‌ నిర్వహించింది.

లెఫ్టినెంట్‌ అహాన్‌ కుమార్‌ నేతృత్వంలోని 61 మంది అశ్విక దళం కవాతు నిర్వహించింది. అనంతరం ట్యాంక్‌ టి-90, బిఎంపి -2 శరత్‌తోపాటు నాగ్‌, బ్రహ్మోస్‌ క్షిపణి వ్యవస్థలు, పినాక, అగ్నిబాణ్‌ మల్టీ బ్యారెల్‌ రాకెట్ లాంఛర్‌లు, ఆకాశ్‌ వెపన్‌ సిస్టమ్‌, చేతక్‌, బజరంగ్‌, ఐరావత్‌ సహా పలు ఆయుధాలను ప్రదర్శించారు.  ఈ వేడుకల్లో త్రివిధ దళాలు సంయుక్తంగా ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘సశక్త్‌ ఔర్‌ సురక్షిత్‌ భారత్‌’ అనే థీమ్‌తో ఈ శకటాన్ని రూపొందించారు.

75వ రిపబ్లిక్‌ వేడుకలను పురస్కరించుకొని ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ సైనిక అమరవీరులకు నివాళులు అర్పించారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌, త్రివిధదళాల అధిపతులతో కలిసి ఇండియా గేట్‌ సమీపంలోని జాతీయ యుద్ధస్మారకం వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్వాగతం పలికారు.  అమరవీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించిన ప్రధాని మోదీ ఆ తర్వాత సైనికవందనం స్వీకరించారు. స్మారకం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేసిన అనంతరం కర్తవ్యపథ్‌కు వెళ్లారు.

కాగా, దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మనం మన అద్భుతమైన గణతంత్ర వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా మన అభివృద్ధి ప్రయాణం ప్రజాస్వామ్యం, గౌరవంతోపాటు ఐక్యతగా దేశ అభివృద్ధి ప్రయాణం సాగేలా మార్గాన్ని రూపొందించిన మహనీయులందరికీ నివాళులర్పిస్తున్నా. ఈ వేడుక మన రాజ్యాంగ విలువలను కాపాడుతుందని, బలమైన, సంపన్నమైన దేశాన్ని నిర్మించే దిశగా మన ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నా అంటూ ఎక్స్‌ వేదిగా పోస్ట్‌ చేశారు.