నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లపై ముగిసిన ఐటి దాడులు

నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లపై ముగిసిన ఐటి దాడులు
 
సినీ నిర్మాతలు, నిర్మాణ సంస్థల్లో ఐదు రోజులపాటు సాగిన ఆదాయపు పన్ను అధికారుల సోదాలు శనివారం తెల్లవారుజామున ముగిశాయి. సెర్చ్ వారెంట్‌తో మంగళవారం చేపట్టిన తనిఖీలు శనివారం నాటికి ముగిశాయి. ఈ సోదాల్లో పలువురు సినీ నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు చెందిన కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్‌‌రాజు, పుష్ప-2 డైరెక్టర్‌‌‌‌ సుకుమార్‌‌‌‌, ప్రొడ్యూసర్‌‌‌‌ నెక్కంటి శ్రీధర్ ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌‌, మ్యాంగో మీడియా, దిల్‌‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సహా పలు సంస్థల్లో సోదాలు జరిగాయి. 
శుక్రవారం చాలా మంది ఇళ్లల్లో సోదాలు పూర్తికాగా, శనివారం తెల్లవారుజాము వరకూ మరికొంతమంది ఇళ్లలో ఐడీ దాడులు జరిగాయి. ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్‌‌రాజు ఇంట్లో శుక్రవారంతో సోదాలు ముగిశాయి. తొలుత ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు సోదాలు నిర్వహించారు. రెండేళ్లుగా వచ్చిన లాభాలకు కట్టిన ట్యాక్స్‌కు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. 
 
అలాగే సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ చేంజర్ చిత్రాలకు సంబంధించిన లాభాలపై ఆరా తీశారు. ఆ తర్వాత పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దిల్‌రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తరలించారు.  దిల్ రాజు ప్రొడక్షన్స్‌ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించి రెండేళ్లుగా నిర్మించిన చిత్రాల వ్యయం, ఆదాయాలపై ఆరా తీశారు. అక్కడ కూడా కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారు.
ఆదాయం, పన్ను చెల్లింపుల్లో తేడాలకు సంబంధించి దిల్‌‌రాజు, ఎస్‌‌వీసీ ఆడిటర్‌‌‌‌, అకౌంటెంట్‌‌ స్టేట్‌‌మెంట్స్‌‌ను ఐటీ అధికారులు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.
దిల్ రాజు కుటుంబ సభ్యుల బ్యాంక్‌ లాకర్లను ఐటి అధికారులు తెరపించారు. దిల్‌ రాజు సోదరుడు విజయసింహ నివాసంలోనూ సోదాలు జరిగాయి. విజయసింహారెడ్డి ఆటోమొబైల్‌ ఫీల్డ్‌లో ఉన్నారు. దిల్‌రాజు, విజయసింహ మధ్య లావాదేవీల పరిశీలించారు. 

ఐదు రోజుల పాటు 18 ప్రదేశాల్లో 55 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీపై ఐటీ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏకకాలంలో పెద్ద పెద్ద బ్యానర్లు, నిర్మాణ సంస్థలు, నిర్మాతల ఇళ్లపై ఐటీ శాఖ దాడులు ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.