విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ. 11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ!

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ. 11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ!

పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేయగా నేడు కేంద్ర మంత్రులు అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తం రూ. 11,500 కోట్ల సాయం కేంద్రం అందించనుంది.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఊపిరులూదబోతోంది. దీనికి గురువారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. నేడు కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్‌నాయుడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

విశాఖ ఉక్కు కర్మాగారానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. ఇటీవల ప్రధానిని కలిసి విశాఖ ఉక్కుకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీనిపై విభిన్న కోణాల్లో చర్చించన అంతరం కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యమున్న విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో కూరుకుపోయింది. 2023-24లో  రూ. 4,848 కోట్లు, 2022-23లో రూ. 2,858 కోట్ల నష్టం మూటగట్టుకొంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడంతో ప్లాంట్ నష్టాల్లోకి జారిపోయింది. సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేంద్రపెద్దలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ప్లాంట్‌ను సందర్శించారు.

కర్మాగారం మళ్లీ నిలదొక్కుకోవాలంటే 18 వేల కోట్లు అవసరమని ఆ సమయంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కార్మిక సంఘాల నేతలు ఆయనకు విన్నవించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే కేంద్ర ఉక్కుశాఖ ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు రూ. 500 కోట్లు, ముడిసరకుకు సంబంధించి బ్యాంకు అప్పుల చెల్లింపులకు రూ. 1,150 కోట్ల చొప్పున రెండు విడతల్లో సాయం చేసింది.

వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారంతో పాటు , తగినంత ముడిసరకు లేకపోవడం, కోర్టు ఎటాచ్‌మెంట్లు, ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ తో విశాఖ ఉక్కు కర్మాగారం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వీటి నుంచి సంస్థను బయటపడేయడంతో పాటు భవిష్యత్తులో తలెత్తే కష్టాల నుంచి తప్పించడానికి ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పార్లమెంటు స్థాయీసంఘానికి చెప్పింది. 

దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సిఫార్సు చేసింది. దీని ప్రకారమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ అందించడానికి ముందుకొచ్చినట్లు సమాచారం. రూ.10,300 కోట్లను బాండ్ల రిడెంప్షన్ ద్వారా, మిగిలిన మొత్తాన్ని ఇతర మార్గాల్లో సమకూర్చడానికి సిద్ధ మవుతున్నట్లు సమాచారం. మొత్తం ప్యాకేజీ విధివిధానాలు ఎలా ఉంటాయన్నది కేంద్ర మంత్రి అధికారిక ప్రకటనలో తేలనుంది.