కాలేజీల్లో కనిపించని 20 వేల మంది భారతీయ విద్యార్థులు!

కాలేజీల్లో కనిపించని 20 వేల మంది భారతీయ విద్యార్థులు!

* విద్యార్థులు, కార్మికులకు కెనడా వీసా నిబంధనలు సడలింపు

విద్యాభ్యాసం కోసం భారత్‌ నుంచి తమ దేశానికి వచ్చిన వారిలో 20 వేల మంది ఆయా కళాశాలల్లో ప్రవేశాలు పొందలేదని కెనడా వలస, కాందిశీకుల, పౌరసత్వ సంస్థ(ఐఆర్‌సీసీ) వెల్లడించింది.  మొత్తం 49,476 మంది విద్యార్థుల్లో 6.9 శాతం మంది తాము ఐఆర్‌సీసీలో నమోదు చేసుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందలేదని నివేదిక తెలిపింది.

మొత్తం 3.27 లక్షల మంది విద్యార్థుల్లో 19,582 మంది(5.4 శాతం) విద్యార్థులు సంబంధిత కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి తమ సమ్మతి తెలపలేదని వెల్లడించింది. మరో 12,553 మంది ప్రవేశాల సమాచారం విద్యాసంస్థల వద్ద లేదని చెప్పింది. విద్యార్థులతో పాటు ఇతరుల తాత్కాలిక నివాసితుల వీసాలు పెరగడాన్ని కూడా ఐఆర్‌సీసీ తన నివేదికలో పేర్కొంది. 

అయితే నివేదిక పేర్కొన్న దాని కంటే ఎక్కువ మంది భారత విద్యార్థులు కళాశాలల్లో ప్రవేశాలు పొంది ఉండరని వలసల విశ్లేషకుడు దర్న్‌ మహరాజా తెలిపారు. అయితే కెనడాకు వచ్చాక తాము చేరదలచుకున్న విద్యా సంస్థ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వర్క్‌ పర్మిట్‌కు అర్హత కలిగి లేదని తెలుసుకున్నాక విద్యార్థులు వేరొక కాలేజీని ఎంపిక చేసుకుంటున్నారని, ఈ సమాచారాన్ని ఐఆర్‌సీసీలో అప్‌డేట్‌ చేయకపోవడం వల్ల కళాశాలల్లో నమోదు కాని విద్యార్థుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నదని దీక్షిత్‌ సోనీ అనే కన్సల్టెంట్‌ విశ్లేషించారు.

అయితే, మొత్తం 144 దేశాల నుండి విద్యార్థులను ట్రాక్ చేయగా ఆ విధంగా వారు పేర్కొన్న కళాశాలల్లో చేరని విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉంటున్నట్లు కెనడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు, ఫిలిప్పీన్స్ నుండి 688 మంది విద్యార్థులు (2.2 శాతం) మరియు చైనా నుండి 4,279 (6.4 శాతం) మంది తమ నియమించబడిన పాఠశాలలకు హాజరు కాలేదు.

దీనికి విరుద్ధంగా, ఇరాన్ (11.6 శాతం), రువాండా (48.1 శాతం) దేశాలలో నిబంధనలను పాటించని రేటు చాలా ఎక్కువగా ఉంది. కెనడా-యుఎస్ సరిహద్దులో అక్రమ వలసలకు దోహదపడుతున్నారని ఆరోపిస్తూ కెనడియన్ కళాశాలలు, భారతదేశంలోని సంస్థల మధ్య సంబంధాలపై భారత చట్ట అమలు సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి.

కొంతమంది భారతీయ విద్యార్థులు కెనడాలోకి ప్రవేశించి చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించడానికి స్టడీ పర్మిట్లను సాకుగా ఉపయోగించుకున్నట్లు తెలిసింది. మాజీ ఫెడరల్ ఆర్థికవేత్త, ఇమ్మిగ్రేషన్ నిపుణుడు హెన్రీ లోటిన్ ది గ్లోబ్ అండ్ మెయిల్‌తో మాట్లాడుతూ, నిబంధనలను పాటించని భారతీయ విద్యార్థులు చాలా మంది కెనడాలోనే ఉండి, శాశ్వత నివాసం కోసం పనిచేస్తూనే ఉంటారని చెప్పారు.

మరోవంక, తమ జీవిత భాగస్వామిని కెనడాకు రప్పించేందుకు అవసరమయ్యే ‘ఓపెన్‌ వర్క్‌ పర్మిట్స్‌’ (ఓడబ్ల్పీ) నిబంధనలని కెనడా సడలించింది. నూతన ‘ఓడబ్ల్యూపీ’ విధానాన్ని 2025 జనవరి 21 నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఆ దేశంలో పనిచేస్తున్న విద్యార్థుల, కార్మికుల భాగస్వాములు కూడా కొత్త ఓపెన్‌ వర్క్‌ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. 
 
కెనడా లేబర్‌ మార్కెట్‌కు, భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రొఫెషనల్‌ కోర్సులు, డాక్టోరల్‌, మాస్టర్స్‌ ప్రోగామ్స్‌, 16 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ గడువు కలిగిన కోర్సులు చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల భాగస్వాములు అర్హులుగా పేర్కొన్నది.