
ఢిల్లీ అంతటా ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నట్లు పేర్కొంది. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 17 వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. జనవరి 20 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.
ఢిల్లీలో 1.55 కోట్ల ఓటర్లు ఉన్నారని, వీరిలో 83.49 లక్షల పురుష ఓటర్లు, 71.74 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారని, ఐదోసారి ఓటింగ్‌లో పాల్గొంటున్న వారు 2.08 లక్షల మంది ఉన్నారని చెప్పారు. 25.89 లక్షల మంది యువ ఓటర్లు (20-29) ఉన్నట్టు తెలిపారు. ఢిల్లీలో13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
షెడ్యూల్ విడుదల సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఈవీఎంలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంపై క్లారిటీ ఇచ్చారు.vఓటర్ల జాబితా ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపింది.
ఈవీఎంలను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని స్పష్టం చేసింది. గత ఏడాది ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేసింది. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటిందని, మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లు దాటిందని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది తొలి ఎన్నికలు ఢిల్లీలో జరగబోతున్నాయని తెలిపారు. ఢిల్లీలో అన్ని ప్రాంతాల ఓటర్లు ఉంటారని పేర్కొన్నారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు సీఈసీ రాజీవ్‌కుమార్ ఖండించారు. ఈవీఎంలతోనే ఫలితాలు పారదర్శకంగా ఉంటాయని, ఈవీఎంల రిగ్గింగ్ జరిగినట్లు ఇంతవరకు ఎక్కడా నిరూపణ కాలేదని ఆయన తెలిపారు. ఈవీఎంల రిగ్గింగ్ సాధ్యం కాదని చెప్పారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఇదే తనకు చివరి ప్రెస్ మీట్ అని సీఈసీ చెప్పారు. ఓటింగ్ శాతంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంపై కూడా సీఈసీ స్పందించారు. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటలకు కచ్చితమైన పోలింగ్ శాతం వెల్లడించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
కాగా, 2020 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను అప్పట్లో జనవరి 6న ప్రకటించగా, ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 11న ఫలితాలు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 62 స్థానాలు గెలుచుకుని విజయభేరి మోగించింది. బీజేపీ 8 సీట్లు దక్కించుకుంది. 2013, 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో ఆప్ విజయం సాధించి వరుసగా నాలుగో సారి ఢిల్లీలో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది.
ఒక్కసారి అవకాశం ఇవ్వడంటూ అభివృద్ధి మంత్రంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీ ప్రజల ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపీ, ఆప్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నందున కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయమని, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు