కార్గోలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు

కార్గోలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికాల్లో 60 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కార్గోను నిర్వహించడం ద్వారా 91 ఏళ్ల పోర్టు చరిత్రలో ఒక సువర్ణ ఘట్టాన్ని నమోదు చేసింది. ఈ విషయాన్ని విపిఎ కార్యదర్శి టి.వేణు గోపాల్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2023-24లో మొదటి మూడు త్రైమాసికాల్లో చేసిన 59.73 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల రికార్డును అధిగమించి నూతన రికార్డును పోర్టు నెలకొల్పిందని, సమిష్టి కృషి, వ్యూహాత్మక ప్రణాళికలు, ఆధునిక లాజిస్టిక్స్‌, ఆపరేషనల్‌ వ్యవస్థల సమన్వయంతోనే ఈ అనూహ్య విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. 
 
కొత్త 100 ఎమ్‌టి క్రేన్‌ ఏర్పాటు, విసిటిపిఎల్‌ ద్వారా యంత్రాంగాన్ని మెరుగుపరచడం, వేగవంతమైన కార్గో నిర్వహణ కోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తేవడం, సాంకేతిక సదుపాయాల్లో భాగంగా రియల్‌ టైమ్‌ కార్గో మానిటరింగ్‌ కోసం, డ్యాష్‌ బోర్డ్‌ అనలిటిక్స్‌, కార్యాచరణ సమర్థత కోసం సమన్వయ వ్యవస్థల ఏర్పాటు నూతన రికార్డుకు దోహదపడ్డాయని తెలిపారు. 
 
ఈ ఘనతను సాధించడంలో కృషి చేసిన సిబ్బందిని, భాగస్వాములను పోర్టు ఛైర్మన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు అభినందించారు. ఈ రికార్డు పోర్టుకు దేశ వాణిజ్యాభివృద్ధిలో ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోందని చెప్పారు. పోర్టు యాంత్రీకరణ, బహుముఖ మౌలిక వసతుల కల్పన ద్వారా వివిధ మార్గాలను అనుసంధానం చేసే పనులకు ప్రాధాన్యతనిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
అందుకోసం 10 లైన్ల రహదారుల విస్తరణ, అంతర్గత ఫ్లైఓవర్ల నిర్మాణం, ప్రస్తుత టెర్మినల్స్‌ ఆధునికీకరణ. వంటి పనులను శీఘ్రగతిన చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పోర్టును సముద్ర వాణిజ్యంలో మరింత బలోపేతం చేయడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు.