ప్రధాని మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం
కువైట్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ ద గ్రేట్‌’ అందుకున్నారు. కువైట్‌ రాజు షేక్‌ మేషాల్‌ అల్‌-అహ్మద్‌ అల్‌-జబేర్‌ అల్‌-సబా ఈ అవార్డు అందజేశారు.  ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ కువైట్‌లో రాజపూర్వక గౌరవ పురస్కారం. ప్రధాని మోదీకి లభించిన 20వ అంతర్జాతీయ పురస్కారం ఇది.
మైత్రీ చిహ్నంగా దేశ, విదేశీ సార్వభౌమ ప్రభుత్వాధినేతలు, రాజ కుటుంబాల సభ్యులకు దానిని ప్రదానం చేస్తుంటారు. ఇంతకు ముందు ఆ అవార్డును బిల్ క్లింటన్, ప్రిన్స్ చార్లెస్, జార్జి బుష్ వంటి ప్రపంచ నేతలకు ప్రదానం చేశారు.
 
అనంతరం రెండు దేశాల మధ్య సంబధాలు బలోపేతం చేసేలా ఇరువురు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.  ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశంపై ఆ సమావేశంలో చర్చించారు. రాజకీయ, వాణిజ్య, ఇంధన, రక్షణ, భద్రత, ఆరోగ్యం, ఎడ్యుకేషన్‌, టెక్నాలజీ, సాంస్కృతిక భాగస్వామ్యాలపై వీరిమధ్య చర్చ జరిగింది. 
 
కువైట్‌లోని పది లక్షల మందికి పైగా భారతీయుల సంక్షేమాన్ని చూస్తున్నందుకు ఎమీర్‌కు మోదీ  ధన్యవాదాలు తెలియజేశారు. తమ గల్ఫ్ దేశం అభివృద్ధి ప్రస్థానంలో భారతీయ సమాజం తోడ్పాటకు కువైటీ అధినేత అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సమావేశంలో ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు కువైట్‌ బృందం ఒకసారి భారత్‌లో పర్యటించాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆహ్వానించారు. భారత విదేశాంగ శాఖ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది.

ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంతోపాటు ఫార్మా, ఐటీ, ఫిన్‌టెక్, సెక్యూరిటీ. ఇంధనరం వంటి కీలక రంగాల్లో సహకారంపై చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘ఇది అద్భుతమైన భేటీ. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడటానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాం. ఇరుదేశాల మధ్య సాధారణ భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లాం.’ అని మోదీ వెల్లడించారు.

ఆ తర్వాత కువైట్‌ యువరాజు షేక్‌ సబా అల్‌-ఖలీద్‌ అల్‌-సబాతోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం సహా కీలకరంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. భారత్‌కు చెందిన అగ్రశ్రేణి వ్యాపార భాగస్వాముల్లో కువైట్‌ ఒకటి కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరోలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 10.47 బిలియన్‌ డాలర్లకు చేరింది.

అంతకుముందు ప్రధాని మోదీ కువైట్‌ రాజప్రసాదం వద్ద అధికారిక స్వాగతంతోపాటు గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం కువైట్‌ చేరుకున్న ప్రధాని మోదీ మొదటిరోజు ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం భారతీయ కార్మికుల శిబిరాన్ని సందర్శించి, వారితో కొంచెం సేపు ముచ్చటించారు. గత 43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) ప్రధాని మోదీ పర్యటన వివరాలను ‘ఎక్స్’లో పంచుకుంది. ‘చరిత్రాత్మక పర్యటనకు ప్రత్యేక స్వాగతం! వైభవోపేత స్వాగతం, గౌరవ వందనానికి కువైట్‌లో బయన్ ప్యాలెస్ వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ  వచ్చారు. కువైట్ ప్రధాని గౌరవనీయ షేఖ్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాహ్ సాదరంగా ఆహ్వానించారు’ అని ఎంఇఎ తన ప్రకటనలో తెలిపింది.