బ‌లోచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీలో మ‌హిళా సూసైడ్ బాంబ‌ర్లు

బ‌లోచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీలో మ‌హిళా సూసైడ్ బాంబ‌ర్లు
పాకిస్థాన్‌లోని బ‌లోచిస్తాన్‌ లో ఇటీవ‌ల తిరుగుబాటు ద‌ళాలు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో తీవ్ర ర‌క్త‌పాతం చోటుచేసుకున్న‌ది. ఇరు వైపుల భారీ సంఖ్య‌లో ప్రాణ న‌ష్టం జ‌రిగింది. తాజాగా నిషేధిత బ‌లోచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ తాజాగా మ‌హిళా ఫిదాయిన్‌ల ఫోటోల‌ను విడుదల చేసింది. త‌మ ద‌ళానికి చెందిన ఇద్ద‌రు మ‌హిళా సూసైబ్ బాంబ‌ర్లు భారీ దాడుల్లో పాల్గొన్న‌ట్లు బీఎల్ఏ పేర్కొన్న‌ది. 
 
ఆ ఇద్ద‌రిలో ఒక‌రి పేరు హ‌వా బ‌లోచ్‌ (25). ఆమె తండ్రి కూడా బీఎల్ఏ ఫైట‌ర్‌. 2021లో పాకిస్థాన్ భ‌ద్ర‌తా ద‌ళాల చేతిలో అత‌ను హ‌త‌మ‌య్యాడు. ఇక మ‌రో ఫైట‌ర్‌ను అసిఫా మెంగాల్‌ (24)గా గుర్తించారు. 2002లో ఆమె పుట్టింది. ఇటీవ‌ల నుషిక్‌లోని ఐఎస్ఐ క్యాంపుపై జ‌రిగిన సూసైడ్ దాడిలో ఆమె పాల్గొన్న‌ట్లు బ‌లోచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ తెలిపింది.
 
అసిఫా మెంగల్‌ బలూచిస్థాన్‌లోని నుష్కి జిల్లాకు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ కుమార్తె. అక్టోబర్ 2, 2002న జన్మించిన అసిఫా, 21 ఏళ్లు నిండిన తర్వాత బీఎల్‌ఏ ఉన్నత శ్రేణి మజీద్ బ్రిగేడ్‌లో చేరింది. గత ఏడాది జనవరిలో ఆమె ఆత్మాహుతి దాడికి పాల్పడాలని నిర్ణయించుకుని, ఒక ఆత్మాహుతి మిషన్ కోసం తనను తాను అంకితం చేసుకుంది. 
 
హవా బలోచ్, తిరుగుబాటు కథనంలో ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఉద్భవించింది. హవా బలోచ్ బీఎల్‌ఏ మజీద్ బ్రిగేడ్‌లో సభ్యురాలు. ఆపరేషన్ హెరోఫ్ సమయంలో గ్వాదర్ ఫ్రంట్‌లో పాల్గొంది. ఆమె పాత్రను మహ్సా అమీనీతో పోలుస్తున్నారు. ఆమె మరణం 2022లో ఇరాన్‌లో దేశవ్యాప్త నిరసనలకు దారితీయడం తెలిసిందే. సాయుధ ఉద్యమంలో చేరడానికి ముందు ఆమె ఒక రచయిత్రి, మేధావి అని తెలుస్తున్నది.
 
జెన్ జెడ్ కేట‌గిరీకి చెందిన మ‌హిళ‌లుగా వారిని గుర్తిస్తున్నారు. ఆ ఇద్ద‌రూ మంచి విద్యావంతులే. తిరుగుబాటు ద‌ళంలో చేర‌డానికి ముందు ఆ ఇద్ద‌రూ ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించారు. కానీ ఎన్నో ఏళ్లుగా సాగుతున్న బ‌లోచ్ వేర్పాటువాద ఉద్య‌మంలో యువ‌త‌, చ‌దువుకున్న అమ్మాయిలు కూడా పాలుపంచుకుంటున్నారు.
 
పాకిస్థాన్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బీఎల్ఏ ద‌ళాలు పోరాటం చేస్తున్నాయి. పాకిస్థాన్ భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను టార్గెట్ చేసేందుకు హిరాఫ్‌(బ్లాక్ స్టార్మ్‌) ఆప‌రేష‌న్ చేప‌ట్టిన‌ట్లు బీఎల్ఏ చెప్పింది. ప్రస్తుత ప్రాణాంతక దాడిలో కనీసం 17 మంది భద్రతా సిబ్బందితో సహా దాదాపు 50 మంది మరణించారు. దీనికి ప్రతిస్పందనగా, పాకిస్తాన్ కూడా 40 గంటల పాటు పోరాడి ఇప్పటివరకు 140 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిందని బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టి ఆదివారం తెలిపారు.