
తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత విద్యార్థులకు పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రొఫెసర్ ఏకంగా బైబిల్ చేత బట్టి అన్యమత ప్రచారం నిర్వహించడం కలకలం రేపింది. అంతేగాక తమ మతంలో చేరాల్సిందిగా విద్యార్థులను ఆహ్వానించడం దుమారం రేపింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ)లో అన్యమత ప్రచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఈఈఈ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ చంగయ్య విద్యార్ధులకు అన్యమత ప్రచార బోధన చేస్తున్నారంటూ బజరంగ్ దళ్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి రోజు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు సబ్జెక్టుకు బదులుగా బైబిల్ని బోధిస్తూ, హిందూ దేవుళ్లను కించపరుస్తూ మానసికంగా వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. ప్రొఫెసర్ చంగయ్య కార్యాలయంలో ఇతర మతాలకు సంబంధించిన ఫొటోలు, సాహిత్యం బజరంగ్‌దళ్ నాయకులు గుర్తించి వర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు.
చంగయ్యపై చర్యలు తీసుకోవాలని వైస్ ఛాన్సలర్‌కి వినతిపత్రం అందజేశారు. విద్యార్ధులకు అన్యమత ప్రచార బోధన చేస్తున్న ఆడియో క్లిప్పింగ్‌లు బయటకు వచ్చాయని తెలిపారు. అన్యమత ప్రచారంపై వైస్ ఛాన్సలర్ అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్‌ను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
భజరంగ్ దళ్ నాయకులు ప్రొఫెసర్ని అన్యమత ప్రచారంపై అడగ్గా స్వల్ప వివాదం చోటు చేసుకుంది. సదరు ఆచార్యున్ని గట్టిగా మందలించారు. చంగయ్య కారుపై రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బజరంగ్ దళ్ నాయకులను బయటకు పంపించి పరిస్థితిని అదుపు చేశారు. మత ప్రచారంపై ఓ అధ్యాపకురాలు రెండు రోజుల కిందట వర్సిటీ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య శ్రీనివాసరావును సంప్రదించగా ఆచార్యులతో కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు