
‘క్లైమేట్ జస్టిస్’ పై సంపన్న , పేద దేశాల మధ్య తలెత్తిన ప్రతిష్టంభన చివరి రోజు కూడా కొనసాగడంతో దీనిని పరిష్కరించేందుకు కాప్-29 సదస్సు అదనపు సమయం వెచ్చించింది. వాతావరణ మార్పుల విషపూరిత ప్రభావాలను ఎదుర్కొనేందుకు క్లౖౖెమేట్ జస్టిస్ కింద లక్ష కోట్ల డాలర్లు ఇవ్వాలన్న వర్థమాన దేశాల డిమాండ్‌ను సంపన్న దేశాలు తిరస్కరించాయి.
ముసాయిదా ఒప్పందంలో ఏడాదికి 25 వేల కోట్ల డాలర్లే విదిలించి చేతులు దులిపేసుకోవాలని సంపన్న దేశాలు యత్నించడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రతిష్టంభన తొలగించేందుకు చర్చల్లో భాగంగా తాజాగా ఈ సాయాన్ని 300 బిలియన్ల డాలర్లకు పెంచేందుకు యురోపియన్ యూనియన్, అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు సంబంధిత వర్గాలు శనివారం మీడియాకు తెలిపాయి.
ఏడాదికి 250బిలియన్ల డాలర్ల చొప్పున 2035కల్లా 1.3లక్షల కోట్ల డాలర్ల మేరకు నిధిని సమకూర్చగలమని సంపన్న దేశాలు చేసిన ప్రతిపాదన పట్ల వర్ధమాన దేశాలు పెదవి విరిచాయి. ఇటువంటి ప్రతిపాదనలు పేద దేశాలను అవమానపరచడమేనని పేర్కొన్నాయి. దీనిపై వాతావరణ కార్యకర్తలు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి పనికిమాలిన ఒప్పందాలు కుదుర్చుకునే కన్నా అసలు ఒప్పందం లేకపోవడమే మంచిదని, ఇంతకంటే మెరుగైన ఒప్పందం కోసం పోరాడతామని చెప్పారు.
ఆ ముసాయిదాపై అంగీకారం కుదరకపోవడంతో సదస్సును కూడా కొద్దిగా పొడిగించారు. వాస్తవానికి శుక్రవారమే ఈ సదస్సు ముగియాల్సి వుంది. అయితే వచ్చే దశాబ్ద కాలానికి వాతావరణ నిధి ఏర్పాటుపై ఒక అంగీకారానికి వచ్చేందుకు ప్రయత్నించాలని, ఏకాభిప్రాయంతో ఒప్పందాన్ని ఆమోదించాలని భావించి సదస్సును పొడిగించారు. చెత్త ఒప్పందానికి అంగీకరించే కన్నా ఒప్పందం లేకపోవడమే మంచిదని వర్థమాన దేశాలు మరోసారి స్పష్టం చేశాయి.
కాప్ -29 ముసాయిదా ఒప్పందానికి వ్యతిరేకంగా సదస్సు వెలుపల శనివారం కూడా నిరసనలు హోరెత్తాయి. ఈ నిరసనల్లో వాతావరణ, పౌర హక్కుల కార్యకర్తలు మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ ముసాయిదాను తిరస్కరించాల్సిందిగా వారు వర్ధమాన దేశాలను కోరారు. ఇది అవమానకరమైన, అన్యాయమైన ఒప్పందమని వ్యాఖ్యానించారు. కాప్ 29 సదస్సు జరుగుతున్న వేదిక వద్ద నినాదాలు చేయడం నిషిద్ధం కావడంతో ఆందోళనకారులు మౌనంగా ప్రదర్శన నిర్వహించారు.
ప్రపంచంలోని నిరుపేద, వర్ధమాన దేశాల్లోని ప్రజలకు బాసటగా నిలబడాల్సిందిగా కోరుతున్నామని చెప్పారు. ఇలాంటి చెత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవడం కన్నా అసలు ఒప్పందమే లేకపోవడం చాలా మంచిదని వారు వ్యాఖ్యానించారు. సంపన్న దేశాల మొండితనం కారణంగా ఇది చాలా చాలా చెత్త ఒప్పందమని వారు నొక్కి చెప్పారు. ఈ మేరకు అంతర్జాతీయ సంకీర్ణ సంస్థ అయిన క్లైమేట్ యాక్షన్ నెట్‌వర్క్ (సిఎఎన్) జి 77, చైనాకు ఒక లేఖ రాసింది.
సిఎఎన్‌లో 1900కి పైగా పౌర సమాజ సంస్థలు పనిచేస్తున్నాయి. బలహీనమైన ఒప్పందాలను విడనాడాల్సిందిగా ఆ లేఖ కోరింది. ఈ సదస్సులో బలమైన ఒప్పందమేదీ కుదరదని భావించిన పక్షంలో చర్చా వేదికను బహిష్కరించాల్సిందిగా కోరింది. మరింత బలమైన ఒప్పందం కోసం మరో రోజు పోరాడవచ్చని పేర్కొంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు తాము ఇదే పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపింది.
ప్రతిష్టంభనకు తెర దించేందుకు రాత్రంతా చర్చలు జరిగాయి. ఏడాదికి వంద బిలియన్ల డాలర్ల చొప్పును 2020వరకు ఇవ్వాలన్నది గతంలో కుదిరిన ఒప్పందం. ఆ లక్ష్యం రెండు సంవత్సరాలు ఆలస్యంగా 2022లో నెరవేరింది. 2025తో ఒప్పంద గడువు కాలపరిమితి ముగుస్తోంది. దాంతో కొత్త ఒప్పందం కోసం చర్చలు సాగుతున్నాయి.
వచ్చే ఏడాది కాప్ 30 సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న బ్రెజిల్ పర్యావరణ మంత్రి మరినా సిల్వా మాట్లాడుతూ, ఏడాదికి 390 బిలియన్ల డాలర్ల చొప్పున ఇచ్చేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సవాళ్ళపై నిర్ణయం తీసుకోకుండా బాకూను వీడి వెళ్ళాలనుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. 2030కల్లా 300బిలియన్ల డాలర్లు, 2035కల్లా 390 బిలియన్ల డాలర్లు మొత్తాలకు చేరుకోవాల్సిన అవసరముందని ఆమె తెలిపారు. తద్వారా ఈ లక్ష్యాన్ని సాధించగలుగుతామన్నారు.
కాగా సియర్రా లియోన్ పర్యావరణ మంత్రి అబ్దుల్లా జివా తాజా ప్రతిపాదనపై వ్యాఖ్యానించేందుకు తిరస్కరించారు. ఇతర ప్రతినిధులతో కలిసి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. సిఎఎన్ దక్షిణాసియా సీనియర్ సలహాదారు శైలేంద్ర యశ్వంత్ ఈ ప్రతిపాదనను తీవ్రంగా నిరసించారు. 250 బిలియన్ల డాలర్లు అన్న ప్రతిపాదన చేయడమంటే వర్ధమాన దేశాలను అవమానించడం తప్ప మరొకటి కాదని విమర్శించారు. వరదలు, వడగాడ్పులు, తుపానులు, కొండచరియలు విరిగిపడడం, దావానలం, ఇతర వాతావరణ విపత్తుల నుండి తమ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నించే వారికి ఇటువంటి ప్రతిపాదన చెంప పెట్టు వంటిదని వ్యాఖ్యానించారు.
వాతావరణ మార్పులపై చేపట్టాల్సిన కార్యాచరణకు ఎంత ఖర్చు అవుతుందో సంపన్నదేశాలకు పూర్తిగా తెలుసునని గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్ ఫర్ ది ఫాసిల్ ఫ్యూయల్ ట్రియటీ హర్జీత్ సింగ్ పేర్కొన్నారు. ఏటా లక్షల కోట్ల డాలర్ల మేర ఖర్చవుతుందని తెలిసినా వారు ఇంత నామమాత్రపు మొత్తాన్ని ఇవ్వజూపడం అత్యంత అవమానకరమైన అంశమన్నారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు