ఆస్పత్రులలో భద్రతా చర్యలపై నివేదిక అందించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

ఆస్పత్రులలో భద్రతా చర్యలపై నివేదిక అందించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

దేశవ్యాప్తంగా ఆస్పత్రులలో భద్రతా చర్యలకు సంబంధించి తమ సిఫారసులను జాతీయ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ (ఎన్‌టిఎఫ్‌) సమర్పించింది. కోల్‌కతా అభయ కేసుకు చెందిన పిటిషన్‌లను విచారిస్తున్న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి ఈ కమిటీ మధ్యంతర నివేదికను సమర్పించింది.

ఆస్పత్రుల్లోని వైద్యులు, వైద్య సిబ్బందికి భద్రత కల్పించేందుకు స్వల్పకాలిక, మధ్యస్థ, దీర్ఘకాలిక చర్యలను ఎన్‌టిఎఫ్‌ తన నివేదికలో సూచించిందని కేంద్రం తరపున న్యాయవాది కను అగర్వాల్‌ పేర్కొన్నారు. నివేదికలో గణనీయమైన అంశాలు ఉన్నందున మధ్యంతర నివేదికగా పేర్కొనవద్దని ఆయన కోర్టును కోరారు. ఇది ఎన్‌టిఎఫ్‌ సభ్యులందరూ అంగీకరించిన ఏకగ్రీవ నివేదిక అని తెలిపారు.

ఈ నివేదికను రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, సంబంధిత అధికారులకు పంపాల్సిందిగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఎన్‌టిఎఫ్‌ నివేదికలో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లైతే జూనియర్‌, సీనియర్‌ వైద్యుల సంఘాలు సలహాలు, సూచనలు ఇవ్వాలని, భవిష్యత్తులో దాని అమలును పర్యవేక్షించేందుకు ఒక యంత్రాంగాన్ని కూడా సూచించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కోల్‌కతాలోని ఆర్‌జికర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. ఆస్పత్రుల్లో వైద్యుల భద్రతపై, పని పరిస్థితులపై పలువురు తీవ్ర ఆందోళన లేవనెత్తారు. 

లైంగిక వేధింపులను నిరోధించడానికి, ఇంటర్న్‌లు, రెసిడెంట్‌, నాన్‌రెసిడెంట్‌ వైద్యులకు గౌరవప్రదమైన పని పరిస్థితులను కల్పించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందిగా సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆర్తి సరైన్‌ నేతృత్వంలో నలుగురు సభ్యులతో సుప్రీంకోర్టు ఎన్‌టిఎఫ్‌ను నియమించిన సంగతి తెలిసిందే.

మరోవంక, కోల్‌కతా అభయ కేసు విచారణను పశ్చిమబెంగాల్‌ వెలుపలకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. విచారణను కొనసాగనివ్వాలని, విచారణను రాష్ట్రం వెలుపలకు మార్చలేమని, అది మన సొంత న్యాయవ్యవస్థ పైనే అనుమానాలకు తావిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

 విచారణను రాష్ట్రం వెలపలకు మార్చాలన్న ఈ అభ్యర్థన నవంబర్‌ 11 నుండి రోజువారీ ప్రాతిపదికన ప్రారంభం కానున్న విచారణను వాయిదా వేయడానికి లేదా పక్కదారి పట్టించే ఎత్తుగడగా కూడా కోర్టు అభిప్రాయపడింది.