విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జైలు శిక్ష

విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జైలు శిక్ష
విమానాలపై బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని నో ఫ్లై లిస్ట్ లో చేర్చుతామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఎయిర్‌ క్రాఫ్ట్ సెక్యూరిటీ నిబంధలను కూడా సవరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇటీవల వరసగా వస్తున్న బాంబు బెదిరింపుల గురించి చర్చించి ఈ మేరకు చట్టాలను సవరిస్తున్నామని పేర్కొన్నారు. 
 
ఇలాంటి చర్యలను వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసే నేరంగా పరిగణిస్తామని, చట్టంలో మార్పుల ప్రకారం కఠిన శిక్షలు, జరిమానా ఉంటుందని తెలిపారు. విమానయాన భద్రతే ప్రభుత్యానికి అత్యున్నత ప్రాధాన్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కాగా, ఇప్పటివరకు వచ్చిన బెదిరింపులు అన్నీ నకిలీవి అని గుర్తించినట్లు మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇక ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
“ఎప్పుడు బాంబు బెదిరింపు కేసు వచ్చినా, అది ఫోన్‌ ద్వారా, సోషల్ మీడియా, ఇతర మార్గాల్లో ఎలా వచ్చినా కచ్చితమైన ప్రోటోకాల్ పాటిస్తాం. ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం. ఇందుకు అంతర్జాతీయ మార్గదర్శకాలు ఉన్నాయి. విమానంలో భద్రతాపరమైన సమస్య తలెత్తినప్పుడు ఏం చేయాలో చెప్పే కఠినమైన నిబంధనలు ఉన్నాయి” అని తెలిపారు. 
 
“వాటిలో చిన్న సవరణ ద్వారా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యను నివారించవచ్చు. ఈ సవరణ ద్వారా బెదిరింపుల వెనకున్న వారిని పట్టుకున్న తర్వాత వారిని నోఫ్లయింగ్‌ జాబితాలో చేర్చాలన్నది మా ఆలోచన. రెండోది సప్రెషన్ ఆఫ్‌ అన్‌లాఫుల్ యాక్ట్‌ ఎగైనస్ట్‌ సేఫ్టీ ఆఫ్ సివిల్‌ ఏవియేషన్‌ యాక్ట్‌. దీన్ని స్వాస్కా యాక్ట్‌ అంటారు. ఈ స్వాస్కా యాక్ట్‌లో సవరణకు మేము ప్రయత్నిస్తామ” అని వివరించారు. 
 
తద్వారా విమానం గ్రౌండ్‌లో ఉన్నప్పుడు చేసే ఇలాంటి తప్పులను వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసే నేరంగా పరిగణించి వారిపై కచ్చితమైన చర్యలు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. గత వారం రోజుల్లో భారతతీయ విమానయాన సంస్థలకు చెందిన దాదాపు 100 విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు.
 

అయితే ఇవి తప్పుడు బెదిరింపు కాల్స్‌ అయినా.. ప్రయాణికుల భద్రత, సురక్షిత విషయంలో రాజీ పడటం లేదని.. ప్రయాణికుల ప్రాణాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పారు. కేంద్ర హోంశాఖ, ఇతర ఏజెన్సీలతో కలిసి ఈ విమానాలకు బెదిరింపు కాల్స్‌పై దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శనివారం రోజున 30కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రాగా.. ఆదివారం మరో 24 విమానాలకు అలాంటి బెదిరింపులు వచ్చాయి.