ఇజ్రాయిల్ దాడిలో లెబనాన్ మసీదు ధ్వంసం

ఇజ్రాయిల్ దాడిలో లెబనాన్ మసీదు ధ్వంసం

లెబనాన్‌ దక్షిణ గ్రామమైన క్ఫర్‌ టిబ్నిట్‌లోని ఓ మసీదును ఇజ్రాయిల్‌ పూర్తిగా ధ్వంసం చేసినట్లు ప్రభుత్వ ఆధీనంలోని మీడియా తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున 3.45 గంటలకు శత్రు విమానాలు క్ఫర్‌ టిబ్నిట్‌లోని గ్రామం మధ్యలో ఉన్న మసీదును లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేపట్టిందని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దాడిలో మసీదు పూర్తిగా ధ్వంసమైందని పేర్కొన్నారు.

ఈ మసీదు 100 ఏళ్ల నాటిదని, ప్రత్యేక ప్రార్థనల కోసం నిర్వహించేవారని గ్రామ మేయర్‌ ఫౌద్‌ యాసిన్‌ తెలిపారు. దక్షిణ లెబనాన్‌లోని రమ్య గ్రామంలోని చొరబడేందుకు యత్నించిన ఇజ్రాయిల్‌ దళాలను హిజ్బుల్లా అడ్డుకుందని చెప్పారు.  తమ వైద్య సిబ్బందిపై, ఐరాస శాంతి పరిరక్షక బృందం (యుఎన్‌ సభ్యులు )పై   కూడా దాడి జరిగిందని, వారికి  గాయాలయ్యాయని లెబనీస్‌ రెడ్‌క్రాస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

సిర్బిన్‌లోని ఓ ఇంటిపై వైమానిక దాడి జరిగిందని, అక్కడికి వెళ్లిన లెబనీస్‌ రెడ్‌క్రాస్‌ అంబులెన్స్‌ బృందం, ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళం (యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌) సభ్యులపై మరోసారి దాడి జరిగిందని తెలిపింది. గాయపడిన వారి కోసం వెతుకుతుండగా అదే నివాసంపై రెండోసారి బాంబు దాడి జరిపిందని, వారికి గాయాలయ్యాయని రెడ్‌క్రాస్‌ ఆ ప్రకటనలో పేర్కొంది. రెండు అంబులెన్స్‌లు దెబ్బతిన్నాయని తెలిపింది.

ఇజ్రాయిల్‌ దాడుల్లో మరో యుఎన్‌ సభ్యుడు గాయపడ్డాడని లెబనాన్‌లోని యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌ పేర్కొంది. కాల్పుల్లో గాయపడిన యుఎన్‌ సభ్యుని పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. ఈ వారం ప్రారంభంలో దక్షిణ లెబనాన్‌లోని నఖౌరాలోని యునిఫిల్‌ వాచ్‌టవర్‌పై ఇజ్రాయిల్‌ జరిపిన కాల్పుల్లో ఇద్దరు యుఎన్‌ సభ్యులు గాయపడిన సంగతి తెలిసిందే.

కాగా, యుఎన్‌ సభ్యులపై దాడిని పలు దేశాలు ఖండించాయి. దాడి ఘటనపై ఫ్రాన్స్‌ ఇజ్రాయిల్‌ రాయబారికి నోటీసులిచ్చింది. ఈ దాడులు ఇటలీ, స్పెయిన్‌ ఖండించాయి. యుఎన్‌ సభ్యులపై ఇజ్రాయిల్‌ తన శత్రు చర్యలను నిలిపివేయాలని రష్యా పేర్కొంది. యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌ దళాలపై దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అమెరికా ఇజ్రాయిల్‌కు సూచించింది.