అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నాటికి ఎనిమిదవ రోజు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి మహారథోత్సవం వైభవంగా జరిగింది.
భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీవారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడవీధుల్లో విహరించారు.
గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రాత్రి మలయప్పస్వామికి అశ్వ వాహనసేవ నిర్వహిస్తారు. అశ్వంపై కల్కి అవతారంలో భక్తులకు స్వామివారు దర్శనమివ్వనున్నారు. రాత్రి అశ్వవాహనంతో వాహనసేవలు ముగియనున్నాయిశనివారం చివరి ఘట్టమైన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
రేపు మలయప్పస్వామి, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. ఇప్పటికే చక్రస్నానం ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. భక్తులు ప్రశాంతంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. పుష్కరిణిలో భక్తులకు ఇబ్బంది లేకుండా భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఉత్సవాల్లో ఏడో రోజైన గురువారం ఉదయం 8 గంటలకు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి దర్శనిమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా.. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం.
సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొన్నారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

More Stories
దుర్గగుడి అభివృద్ధికి త్వరితగతిన మాస్టర్‌ప్లాన్
జిఎస్టి ఆదాయం తగ్గడంపై ఏపీ ఆర్థికశాఖ ఆందోళన
మహిళా క్రికెటర్ శ్రీచరణికి గ్రూప్1 ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు