డిల్లీ సీఎం అతిషి నివాసం నుంచి సామగ్రి తొలగింపు

డిల్లీ సీఎం అతిషి నివాసం నుంచి సామగ్రి తొలగింపు

దేశ రాజధానిలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి అధికారిక నివాసానికి పీడబ్ల్యూడీ శాఖ అధికారులు బుధవారంనాడు ‘సీల్’ వేశారు. ఢిల్లీ సీఎం అతిషి సామగ్రిని ఆమె అధికార నివాసం నుంచి పలు వాహనాల్లో పంపివేశారు. 

దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశం మేరకు అధికారులు ఈ చర్యకు పాల్పడినట్లు సీఎంవో కార్యాలయం, ఆప్‌ నేతలు ఆరోపించారు. ఆప్‌ చీఫ్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఖాళీ చేసిన ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ 6లోని అధికార నివాసంలోకి ఢిల్లీ సీఎం అతిషి సోమవారం మారారు. అయితే బుధవారం సీఎం అధికార నివాసం నుంచి అతిషికి సంబంధించిన లగేజ్‌ను పీడబ్ల్యూడీ అధికారులు తొలగించారు. 

ఆ నివాసం మెయిన్‌ డోర్‌కు మరో లాక్‌ వేశారు. ఆ బంగ్లా తాళాలను కేజ్రీవాల్‌ అప్పగించలేదని ఆరోపించారు. కేజ్రీవాల్ తన బంగ్లా తాళాలను సంబంధిత శాఖకు అప్పగించ లేదని, ఆమె నేరుగా వచ్చి ఆయన ఖాళీ చేయగానే అందులో చేరడంతో సమస్య ఏర్పడిందని అధికారులు పేర్కొంటున్నారు.

కాగా, ఈ చర్యపై సీఎం కార్యాలయం (సీఎంవో) స్పందించింది. ‘దేశ చరిత్రలో తొలిసారి ముఖ్యమంత్రి నివాసాన్ని బలవంతంగా ఖాళీ చేయించారు. బీజేపీ పిలుపు మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశంతో సీఎం నివాసం నుంచి అతిషి వస్తువులను తొలగించారు’ అని సీఎంవో ఆరోపించింది. బీజేపీ ముఖ్య నేతకు ఆ బంగ్లా కేటాయించడం సీఎం అతిషిని బలవంతంగా ఖాళీ చేయించినట్లు ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.

అయితే, ఆమె సామాగ్రిని అందులో నుండి తొలగించిన కొద్దీ సేపటికే లెఫ్టనెంట్ గవర్నర్ కార్యాలయం వర్గాలు స్పందిస్తూ ఆ భవనంలోని సామాగ్రి వివరాలు నమోదు చేసిన అనంతరం త్వరలోనే తిరిగి ముఖ్యమంత్రి నివాసంకోసం ఆ భవనాన్ని అప్పగిస్తామని స్పష్టం చేశాయి. అందరూ ముఖ్యమంత్రుల అధికార నివాసములకు మాదిరిగా ఆ భవనంకు కూడా యజమాని పీడబ్ల్యూడి.

ఒక సారి ఖాళీ అయిన తర్వాత అందులోని ప్రభుత్వ సామాగ్రి వివరాలను నమోదు చేసి, అవసరమైన మరమత్తులు చేసి, మరొకరికి అప్పగించడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఖాళీ చేయించినట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి.

మరోవైపు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఈ పరిణామంపై స్పందిస్తూ ఆ నివాసానికి ఎట్టకేలకు సీలు వేశారని పేర్కొన్నారు. ‘ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్ ‘షీష్ మహల్’కు సీల్ పడింది. సంబంధిత శాఖకు తాళాలు ఇవ్వకుండా మళ్లీ ఆ బంగ్లాలోకి అడుగుపెట్టేందుకు మీరు ప్రయత్నించారు. ఆ బంగ్లాలో ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయి?” అని వీడియో సందేశంలో ఆయన ప్రశ్నించారు.