ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగానే ఆప్ పోటీ

ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగానే ఆప్ పోటీ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ ఇచ్చాయి. హస్తం పార్టీ అంచనాలను తలకిందలు చేస్తూ.. బీజేపీ హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. ఈ అనూహ్య ఫలితాలతో ఆ పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్‌ వైఖరిపై మిత్రపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. 
 
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తన భాగస్వామ్య పక్షాలను హస్తం పార్టీ పట్టించుకోలేదని మండిపడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి అతివిశ్వాసం మితిమీరిందని విమర్శిస్తున్నాయి.  తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలిపింది.
 
ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్‌ మాట్లాడుతూ తన భాగస్వామ్య పక్షాలను హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పట్టించుకోలేదని మండిపడ్డారు. వారికి అతివిశ్వాసం మితిమీరిపోయిందని, ఆ కారణంగానే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. 
 
లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీలో ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ హర్యానాలో ఆప్‌, సమాజ్‌ వాదీ పార్టీకి కాంగ్రెస్‌ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఆప్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. 
 
అతివిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్‌, అహంకార బీజేపీపై పోటీ చేసే సామర్థ్యం తమ పార్టీకి ఉందని ప్రియాంకా కక్కర్‌ తేల్చి చెప్పారు. ”ఒకవైపు కాంగ్రెస్‌ మితిమీరిన విశ్వాసం, మరోవైపు బిజెపి దురహంకారం చూస్తున్నాం. అయినా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. గత పదేళ్లుగా మేము చేసిన అభివృద్ధి మాట్లాడుతుంది.. మేము తలదించుకుని ప్రజల ముందుకి వెళతాం ’’ అని  ఆమె తెలిపారు.
 
కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ”పెద్ద గుణపాఠం” అని ఫలితాల అనంతరం ఆప్‌ అధ్యక్షుడు కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.  అతి విశ్వాసంతో వెళ్లవద్దని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతి ఒక్కరూ తీవ్రంగా శ్రమించాలని కార్యకర్తలను హెచ్చరించారు.
‘‘ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. వాటిని తేలిగ్గా తీసుకోవద్దు. మితిమీరిన విశ్వాసం వద్దు.  ప్రతి ఎన్నిక.. సీటు గెలుచుకోవడం రెండూ కష్టమే‘‘ అని   ఆప్‌ కౌన్సిలర్ల సమావేశంలో పేర్కొన్నారు.