మణిపూర్ లో విదేశీ తిరుగుబాటుదారుడి అరెస్ట్‌

మణిపూర్ లో విదేశీ తిరుగుబాటుదారుడి అరెస్ట్‌

విదేశీ తిరుగుబాటుదారుడ్ని అరెస్ట్‌ చేసినట్లు మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు. అస్సాం రైఫిల్స్‌ను ఆయన అభినందించారు. అయితే సీఎం అబద్ధం చెబుతున్నారని కుక్కీ గ్రూప్‌ ఆరోపించింది. అరెస్ట్‌ చేసిన వ్యక్తి శరణార్థి అని పేర్కొంది.  మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ సోమవారం ఇంఫాల్‌లో మీడియాతో మాట్లాడుతూ మయన్మార్‌కు చెందిన తిరుగుబాటు గ్రూపు కుకీ నేషనల్ ఆర్మీ (బర్మా), కేఎన్‌ఏ(బీ) సభ్యుడైన బర్మా జాతీయుడ్ని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. 

‘అస్సాం రైఫిల్స్ కార్యకలాపాలను నేను నిజంగా అభినందిస్తున్నా. మణిపూర్‌లోని ప్రస్తుత సంక్షోభంలో విదేశీ హస్తం ఉంది. ముఖ్యమంత్రిగా మొదటి నుంచి నిరంతరంగా ఈ విషయం చెబుతున్నా. కొంతమంది దానిని నమ్ముతున్నారు. కేఎన్‌ఏ(బీ) సభ్యుడ్ని పట్టుకున్నందుకు అస్సాం రైఫిల్స్‌ను నేను అభినందిస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా, సీఎం ఎన్ బీరెన్ సింగ్ ప్రకటన అబ్ధమని కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (కేఎస్‌వో-జీహెచ్‌క్యూ) ఆరోపించింది. కేఎన్‌ఏ (బీ) సభ్యుడిగా సీఎం పేర్కొన్న వ్యక్తి మయన్మార్‌లో జరుగుతున్న సంఘర్షణ నుంచి పారిపోయి వచ్చిన రిజిస్టర్డ్ శరణార్థి అని పేర్కొంది.  అస్సాం రైఫిల్స్‌కు ఈ విషయం తెలుసని కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి తెలిపారు. అయితే అస్సాం రైఫిల్స్‌, మణిపూర్‌ పోలీసులు ఈ అరెస్ట్‌ గురించి అధికారికంగా ప్రకటించలేదు.

మరోవైపు మణిపూర్ లోని అయిదు జిల్లాల్లో ఇంటర్నెట్‌పై ఉన్న ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించినట్టు హోంశాఖ కమిషనర్ ఎస్‌అశోక్ కుమార్ తెలిపారు. ఈ నెల 10 నుంచి ఇంటర్నెట్‌పై ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ నెల 13 న బ్రాడ్ బ్యాండ్ సేవలను పాక్షికంగా ప్రారంభించారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్, బిష్ణుపుర్, తౌబాల్, కాచింగ్ జిల్లాల్లో ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే.