నమో భారత్ ర్యాపిడ్ రైల్ సహా పలు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ అహ్మదాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నాగ్‌పూర్-సికింద్రాబాద్, కొల్హాపూర్-పుణే, ఆగ్రా క్యాంట్ – వారణాసి, దుర్గ్-విశాఖపట్నం, పుణే – హుబ్బళి, విశాఖపట్నం-రాయ్‌పూర్ సహా భుజ్-అహ్మదాబాద్ మధ్య తొలి మెట్రో రైలును ప్రారంభించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తొలిసారిగా వందే భారత్ మెట్రో రైలును భారతీయ రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. ప్రారంభానికి ముందు ఈ రైలుకు నమో భారత్ ర్యాపిడ్ రైలుగా నామకరణం చేశారు. భుజ్ – అహ్మదాబాద్ మధ్య 359 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5.45 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోనున్నది. రెండు నగరాల మధ్య టికెట్ ధర రూ.455 నిర్ణయించారు. ఈ మెట్రో రైలు గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తనున్నది.
మార్గమధ్యలో అంజర్, గాంధీధామ్, భచౌ, సమాఖియాలీ, హల్వాడ్, ధృంగాధ్ర, విరామ్‌గామ్, చంద్లోడియా, సబర్మతి స్టేషన్లలో ఆగనున్నది. రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైలును తీసుకువచ్చింది. పట్టణ స్టేషన్ల మధ్య పనిచేసే సాంప్రదాయ మెట్రోలకు భిన్నంగా.. నమో భారత్ ర్యాపిడ్ రైలు అంతర నగర గమ్యస్థానాలను కవర్ చేస్తుంది.
పట్టణ కేంద్రాలను చుట్టుపక్కల ప్రాంతాలతో కలుపుతుంది. ఈ రైలులో 2,058 మంది ప్రయాణించవచ్చు. 1,150 మందికి సీటింగ్ సదుపాయం ఉంటుంది. రైలులో సీటింగ్ కోసం కుషన్డ్ సీటింగ్ అమర్చారు. కోచ్‌లన్నింట్లో ఎయిర్ కండీషన్ ఉంటుంది. చూసేందుకు వందే భారత్ తరహాలో కనిపించినా.. రెండు చివర్లలో ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, ఇంజిన్స్‌తో వస్తుంది.
రైలులో ప్రయాణానికి ముందు మాత్రమే ప్రయాణికులు టికెట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో రూ.8వేల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని సీఎం భూపేంద్ర పటేల్, మంత్రులు ఘన స్వాగతం పలికారు.
నమో భారత్ ర్యాపిడ్ రైల్ ప్రాంతీయ కనెక్టివిటీపై దృష్టి సారిస్తుందని, సంప్రదాయ రైళ్లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని, దీని అందుబాటులోకి తెచ్చి రద్దీగా ఉండే మార్గాల్లో ట్రాఫిక్ తగ్గించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కింద అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని విస్తృతంగా అమలు చేయడంతోపాటు, పట్టణ కేంద్రాల మధ్య హై-స్పీడ్ కారిడార్‌లను రూపొందించడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకారం అందిస్తున్నాయి.
More Stories
సచివాలయంపై నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్
ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలి విగ్రహంపై దుమారం
మణిపూర్‌లో తొలిసారి హత్తుకున్న మైతీ, కుకీలు