పకృతి విపత్తులు రాకుండా ప్రతి‌ సిటీకి మాస్టర్ ప్లాన్

పకృతి విపత్తులు రాకుండా ప్రతి‌ సిటీకి మాస్టర్ ప్లాన్
ఇలాంటి పకృతి విపత్తులు రాకుండా ప్రతి‌ సిటీకి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. విజయవాడపై ప్రత్యేక‌ కోణంలో‌ దృష్టి పెట్టాలని చెబుతూ రూ. 80 కోట్లు జిల్లాలకు ప్రభుత్వం ఖర్చు పెడుతోందని తెలిపారు. 
 
తాను వరద ప్రాంతాలకు వెళ్లలేదని వైసీపీ చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కావాలని చేస్తున్న విమర్శలు తప్ప వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.  సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగకూడదనే తాను వరద ప్రాతాలలో పర్యటించలేదని, అయినా తమ  శాఖలు పని చేస్తున్నాయని తెలిపారు. వరద బాదితులకు నేను ఎక్కడి నుంచి అయినా ధైర్యం చెప్పవచ్చని చెప్పారు. 
 
అధికారుల సూచనల మేరకే తాను అక్కడికి వెళ్లలేదని, రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళితే పరిస్థితి మరోలా ఉంటుందని భావించి వరద ప్రాంతాలకు వెళ్లలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను భౌతికంగా వరద ప్రాంతాల్లో పర్యటించకపోయినా అన్ని సహాయక కార్యక్రమాలను మానిటరింగ్ చేశానని చెప్పారు. ఆయా శాఖల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశానని పేర్కొన్నారు.
 
నాలుగు రోజులుగా‌ కురుస్థున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అయ్యిందని, ఉమ్మడి కృష్ణా ‌జిల్లాపై మరింతగా ‌ప్రభావం చూపిందని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఇలాంటి ఉపద్రవం ఎదుర్కోవాల్సి వచ్చిందని,  ఎవ్వరూ ఊహించని విధంగా తెలంగాణ నుంచి వర్షాల వరద నీరు వచ్చిందని చెప్పారు. గత‌ ప్రభుత్వం వారు ఏమీ చేయలేకపోయారని, అందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. 
 
భవిష్యత్తులో ఫ్లడ్ కెనాల్స్ ఏర్పాటుపై‌ సీఎం చంద్రబాబునాయుడుతో చర్చిస్తామని తెలిపారు. గతంలో అన్నమయ్య డ్యామ్ కూడా వైసీపీ నిర్లక్ష్యం కారణంగా కొట్టుకుపోయిందని గుర్తు చేస్తూ బుడమేరు పొంగిపోర్లటంతో విపరీతమైన నష్టం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం బుడమేరు నుంచి ఔట్ లెట్ కెనాల్స్ ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు.
వర్షాలు తగ్గిన వెంటనే బుడమేరు నుంచి వరద సమయాల్లో నీళ్లు వెళ్లిపోవడానికి ఔట్ లెట్ కాలువలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎప్పుడూ లేనంతగా వర్షాలు, వరద రావడం కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయని విచారం ప్రకటించారు. వన్ కల్యాణ్ విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయంలో వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి పరిశీలన చేశారు. 

“నేను బయటకు రాలేదు అనే విమర్శలు అనవసరం. పంచాయతీ రాజ్ శాఖ నుంచి పూర్తిస్థాయిలో సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బయటకు వస్తేనే కాదు, నేను చేసే పనులు అధికార యంత్రాంగంతో కలిసి ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాను. అధికారులు 72 గంటలుగా కష్టపడుతున్నారు. నేను పర్యటనకు వచ్చి వారిని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. అందుకే వరద ప్రాంతాలకి వెళ్లలేదు. నేను 1వ తేదీనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిద్దాం అనుకున్నాను, కాకపోతే నేను వస్తే సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది ఉంటుందని రాలేదు. నేను సాయపడాలే తప్ప, ఆటంకం కాకూడదు” అని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సహాయ పునరావాస కార్యక్రమాల కోసం 262 పంచాయతి రాజ్ టీమ్‌లను ఏర్పాటు ‌చేశామని వెల్లడించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1 లక్షా 72 వే‌ల‌ హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని, 17,645 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నష్టపోయాయని తెలిపారు. 2,851 కిలో మీటర్లు ఆర్ అండ్ బి రోడ్లు దెబ్బతిన్నాయని చెబుతూ వరద తగ్గుముఖం పట్టిందని,  ఎవ్వరూ ఆందోళన ‌చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. 
 
బుధవారం నాటికి 5 లక్షల ‌క్యూసెక్కులు వరద నీరు వచ్చే అవకాశం వుందని చెబుతూ అతి తక్కువ సమయంలో ప్రభావంతంగా పని చేశామని తెలిపారు. మూడు పార్టీల వ్యక్తులు కలిసి సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. తన  వంతుగా కోటి రూపాయలు సీఎం సహాయ నిధికి ఉడుతలా సాయంగా ఇస్తున్నానని ప్రకటించారు. రాష్ట్ర హితవు కోరే ప్రతి వ్యక్తి ఇలాంటి సమయంలో సహాయ పడాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.