
బంగాళా ఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో పంటలు నీటమునిగాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తోన్న వానతో విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
విజయవాడ మొగల్రాజపురంలో సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. కొండచరియలు విరిగిపడి మరో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు.
మృతులు మేఘన, బి. లక్ష్మీ, అన్నపూర్ణ, లాలో పూర్కయత్గా గుర్తించారు. దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారోనని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు చనిపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
కాగా, వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు రాగల రెండురోజులు సైతం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు