కళింగపట్నం సమీపంలో తీరం దాటిన అల్పపీడనం

కళింగపట్నం సమీపంలో తీరం దాటిన అల్పపీడనం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం బలపడి వాయుగుండంగా మారి శనివారం అర్ధరాత్రి 12.30- 2.30 గం మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటిననట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం చాలా చోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
 
కాగా, భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు రూ.3 కోట్లు చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప.. బయటకు రావొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. శనివారం వర్షాలు, వరదలపై నిరంతరం సమీక్షించారు. 
 
‘‘వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం వెంబటి ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి. జిల్లా కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. హుద్‌హుద్‌ తుఫాన్‌ సమయంలో అనుసరించిన బెస్ట్‌ ప్రాక్టీసె్‌సను ఇప్పుడూ పాటించాలి. చిన్న ఘటన జరిగినా సహించేది లేదు. ప్రాణనష్టం లేకుండా చూడాలి’’ అని సీఎం ఆదేశించారు.
 
దీని ప్రభావంతో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.  ఇక, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను అస్నా కేంద్రం నుంచి బంగాళాఖాతంలోని వాయుగుండం కేంద్రం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. 
 
భారీ వర్షాల నేపథ్యంలో  మంగళగిరిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సీసీఎల్‌ఏ జి. జయలక్ష్మి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వివిధ శాఖలు, జిల్లా యంత్రాంగం చేపట్టిన ఆపరేషన్లను పర్యవేక్షిస్తుంది. 4 జోన్ల లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు నలుగురు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను నియమించారు.
 
 శనివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.  ఆదివారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. సముద్రంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.  ఇక, రాష్ట్రంలోని కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. 
 
శనివారం గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, బాపట్ల, పల్నాడు, పార్వతీపురం మన్యం, ప్రకాశం సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో 27.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.