మరోవైపు తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు ప్రకటన జారీ చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ కూడా తెలంగాణలో వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు పడే అవకాశముందని తెలిపింది.
సోమవారం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. మంగళవారం తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి.
మంగళవారం ఉదయం కూడా నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బి నగర్ నుంచి మియాపూర్ వరకు అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
పలుచోట్ల మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మలక్‌పేట రైల్వే స్టేషన్ వద్ద ఆర్వోబీ నీట మునగడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మలక్‌పేట రైల్వే స్టేషన్ నుంచి ముసారాంబాగ్, సంతోష్‌నగర్ వరకు, కోఠీ వైపు చాదర్‌ఘాట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఉస్మానియా మెడికల్ కాలేజీవద్ద రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

More Stories
జీహెచ్ఎంసీ డివిజన్లు రెట్టింపు ప్రక్రియపై బిజెపి అభ్యంతరం
దేవతలను కించపరిచారని యూట్యూబర్ అన్వేష్‌పై కేసులు
నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు