జగన్ హయాంలో రూ 5 లక్షల కోట్ల స్వాహా!

జగన్ హయాంలో రూ 5 లక్షల కోట్ల స్వాహా!

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని అప్పటి  ముఖ్యమంత్త్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ 2 లక్షల కోట్లను స్వాహా చేయగా, ఆ పార్టీ నేతలు మరో రూ 3 లక్షల కోట్ల మేరకు స్వాహా చేశారని మాజీ మంత్రి, జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ఓట్ల లెక్కింపు జరిగి నేటికి రెండు నెలలు పూర్తయిందని రాష్ట్రంలో ఎటుచూసినా అక్రమాలు, కబ్జాలు అనేకం వెలుగులోకి వచ్చాయని గుర్తు చేశారు. 

వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్సార్సీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వాస్తవ విషయాలు పక్కనపెట్టి జగన్‌ దిల్లీలో ధర్నాకు దిగారని ఇష్టం వచ్చినట్లు అప్పు చేశారని ఆదినారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు 7 శ్వేతపత్రాల ద్వారా అనేక విషయాలను బయటపెట్టారని గుర్తు చేశారు. 

ఈ 60 రోజుల్లో 1వ తేదీన ఉద్యోగులు, ఫించనుదారులు, సామాజిక భద్రతా ఫించన్లు ఠంచనుగా అందించిన ఘనత మహాకూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. ఈ సారి జగన్‌ను పులివెందుల్లో సైతం ఓడిస్తామని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పులివెందల అభివృద్ధి పేరుతో రూ. 60 కోట్ల పనులను రూ.600 కోట్లకు చేసినట్లు చూపించి ఆ డబ్బులు కూడా చెల్లించలేదని మాజీ మంత్రి మండిపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి సున్నా అని త్వరలో వైఎస్సార్సీపీ కూడా అదే స్థితికి రాబోతోందని బిజెపి ఎమ్యెల్యే జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో పరిశ్రమలు, సంస్థలు, నీటిపారుదల, మౌలిక వసతులు, పర్యాటకం బాగా వృద్ధి చెందుతాయని తెలిపారు.  సంక్షేమ పథకాల ద్వారా పేదలకు లబ్ధి చేకూరుతుందని భరోసా ఇచ్చారు. 

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, అమరావతి పనుల కోసం తొలిదశ నిధులు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. విశాఖ రైల్వేజోన్‌ త్వరలోనే క్లియర్‌ అవుతుందని, విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలానే కడప స్టీల్‌ ప్రారంభమవుతుందని తెలిపారు.

అర్హులందరికీ ఇళ్లు వస్తాయని, రాష్ట్రానికి కావాల్సినంత గ్రామీణ ఉపాధి లభిస్తుందని తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి సహా ఆ పార్టీకి చెందిన నాయకులు అనేక మంది జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. దస్త్రాలు దహనం, కాలువల్లో పారేయడం వంటివి వారి దుశ్చర్యలకు నిదర్శనాలుగా ఆయన అభివర్ణించారు.

 జగన్‌ పాలనలో జరిగిన మద్యం విక్రయాల్లోనే భారీ కుంభకోణం బయటపడుతుందని మాజీ మంత్రి తెలిపారు. వైఎస్సార్సీపీకి రాజకీయాలు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తారనే భయంతోనే ఎమ్మెల్సీగా పోటీకి మాజీ మంత్రి బొత్సకు అవకాశం కలిపించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కబ్జాలు, తప్పులు జరని ప్రాంతం ఏది లేదని ఆయన చెప్పారు.