
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు హాని తలపెట్టేలా చక్రవ్యూహాన్ని నిర్మించిందని, ఆ చక్రవ్యూహాన్ని తాము ఛేదిస్తామని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్ ఇచ్చారు. అవును రాహుల్‌గాంధీ చెప్పినట్లుగానే తాము చక్రవ్యూహం నిర్మించామని ఆయన స్పష్టం చేశారు.
అయితే రాహుల్ ఆరోపించినట్లుగా తమది ప్రజలకు హానిచేసే చక్రవ్యూహం కాదని, కాంగ్రెస్ పార్టీ అవినీతి, కుంభకోణాలను కట్టడిచేసే చక్రవ్యూహమని చెప్పారు.
తాము అవినీతిని ఏ మాత్రం సహించబోమని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. రాహుల్‌గాంధీ, ఆయన తల్లి సోనియాగాంధీ 10 ఏళ్లు రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడిపించారని, అప్పుడు కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నప్పుడు లేని కులగణన ప్రస్తావన ఇప్పుడు ఎందుకని, ఇదంతా ఒక డ్రామా అని జోషి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లుగా చేసిన అవినీతిని, కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి రాహుల్‌గాంధీ డ్రామాలు ఆడుతున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు.బడ్జెట్‌పై చర్చలో భాగంగా రాహుల్‌గాంధీ సోమవారం లోక్‌సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. అంబానీ, అదానీ లాంటి పెట్టుబడిదారులను ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను.. అధికార పీఠం కూలకుండా ఉండేందుకు అవసరమైన మిత్రపక్ష రాజకీయ పార్టీలను.. ప్రజాస్వామ్య విరుద్ధంగా మచ్చిక చేసుకుని కేంద్రం చక్ర వ్యూహం నిర్మించిందని ఆరోపించారు. ఆ చక్ర వ్యూహాన్ని తాము ఛేదించి తీరుతామని సభలో శపథం చేశారు.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం