అమరావతి రాజధాని ప్రాంతంలో 2,668 కిమీ రోడ్లు

అమరావతి రాజధాని ప్రాంతంలో 2,668 కిమీ రోడ్లు
రాజధాని అమరావతి పరిధిలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కీలకమైన కనెక్టవిటీతోపాటు, 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న రోడ్లను పూర్తి చేయడంపై దృష్టి సారించింది. గతంలో మాదిరి విమర్శలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో మొత్తం లేఅవుట్‌ ఏర్పాటుకు సిద్ధమవుతుంది.  విజయవాడ పశ్చిమ ఔటర్‌ రింగురోడ్డు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ప్రాథమిక కనెక్టవిటీ సమస్య కొంత వరకు పరిష్కారమవుతుందని, రోడ్లను బాగు చేస్తే దాదాపు విమర్శలకు తావుండదని ఆలోచన చేస్తోంది.
దీనిపై ఇటీవల మంత్రి నారాయణ ఆధ్వర్యాన సిఆర్‌డిఎ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది.  సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతోపాటు అంతర్గత రహదారుల విస్తరణనూ ప్రధాన అంశంగా తీసుకోవాలని నిర్ణయించింది. తొలుత రాజధాని రూపురేఖల కోసం రోడ్ల వెంట, ప్రధాన నిర్మాణాల ప్రాంతాల్లో జంగిల్‌ క్లియరెన్స్‌కు రూ.64 కోట్లతో టెండర్లు ఇచ్చారు. తాత్కాలికంగా అక్కడక్కడా జరుగుతున్నా.. పూర్తిస్థాయిలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేయాల్సి ఉంది.
 
రెండోదశలో ట్రంకు రోడ్లను నిర్మించాలని భావిస్తోంది. దీనిలో మేజర్‌ ఆర్టిరీయల్‌ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు (60 మీటర్లు లేదా 200 అడుగులు వెడల్పు) 72.97 కిలోమీటర్లు నిర్మించనున్నారు. రెండో దశలో 101 కిలోమీటర్ల ఆర్టిరీయల్‌ రోడ్లు (50 మీటర్ల వెడల్పు) నిర్మించనున్నారు. మూడోదశలో 147.21 కిలోమీటర్ల సబ్‌ ఆర్టిరీయల్‌ రోడ్లు (50 మీటర్లు) నిర్మిస్తారు. ఇవి మొత్తం 321.90 కిలోమీటర్ల దూరం ఉండనున్నాయి. 
 
ఈ రోడ్ల నిర్మాణంలో వేర్వేరు సదుపాయాల కల్పనను బట్టి కిలోమీటరుకు రూ.11 కోట్ల నుండి రూ.18 కోట్ల వరకూ అంచనాలు ప్రతిపాదించారు. గత ఐదేళ్లలో ధరల పెరుగుదల నేపథ్యంలో వీటి అంచనాల్లో పెరుగుదల ఉండొచ్చని మంత్రికి అధికారులు వివరించారు. వాటిపై వెంటనే నివేదిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు. 
 
ఇవి కాకుండా అమరావతి గవర్నమెంటు కాంప్లెక్స్‌ పరిధిలోని 1,575 ఎకరాల విస్తీర్ణంలో అంతర్గత రోడ్లు 47.44 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంటుంది. ఇక పూలింగు స్కీములో రైతులకు తిరిగి ఇచ్చిన ప్లాట్లలో 2,300 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాల్సి ఉంది. ప్లాట్ల ఏరియాను బట్టి వీటిని ఎ, బి, సి, డి జోన్లుగా విభజించారు. ఇవి 12 మీటర్ల నుండి 25 మీటర్ల విస్తీర్ణం వరకూ ఉన్నాయి. వీటికి కిలోమీటరుకు రూ.కోటి వరకూ ఖర్చు చేయనున్నట్లు తెలిసింది.