ప్రతిపక్ష నాయకుడి హోదాకై వైఎస్ జగన్ డిమాండ్

ప్రతిపక్ష నాయకుడి హోదాకై వైఎస్ జగన్ డిమాండ్
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకు ఓ లేఖ వ్రాసారు. పైగా, మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు 10 శాతం మంది సభ్యులు ఉండాలనే వాదనని అధికార కూటమి లేవదీస్తూ ఉండడాన్ని తప్పు పట్టారు. ఆ విధంగా చట్టంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు.

విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని జగన్ తన లేఖలో తెలిపారు. పార్లమెంట్ లో గాని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో గాని 10 శాతం మంది సభ్యులు ఉండాలనే నిబంధనను అమలు పరచలేదని చెప్పారు. విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోందని ఆయన తెలిపారు.

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకున్నాయని, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల విపక్షంలో వైఎస్సార్‌సీపీ మాత్రమే ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 40శాతం ఓట్లను సాధించిందని ఆ లేఖలో ప్రస్తావించారు జగన్.  వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీ కార్యకలాపాల్లో కట్టడి చేస్తున్నట్లే అవుతుందని స్పష్టం చేశారు.

 

భారత రాజ్యంగా ప్రకారం ఆర్టికల్-208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో పలానా సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు.   1984 లోక్‌సభలో 543 స్థానాలకు ఎన్నికలు జరిగితే.. టీడీపీ 30 ఎంపీ సీట్లు గెలుచుకుందని, అప్పుడు సభలో 10శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని లేఖలో ప్రస్తావించారు జగన్.

1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు మాత్రమే వచ్చాయని, 10శాతం సీట్లు కాంగ్రెస్ పార్టీకి లేకపోయినా పి జనార్థన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని తెలిపారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు బీజేపీ కేవలం 3 సీట్లు వచ్చినా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని పేర్కొన్నారు.

 
ప్రతిపక్ష హోదాతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని, ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని జగన్ స్పష్టం చేశారు.