పర్యావరణ పరిరక్షణకై ఇంగ్లాండ్ లో స్వచ్ఛంద సంస్థల ర్యాలీ

పర్యావరణ పరిరక్షణకై ఇంగ్లాండ్ లో స్వచ్ఛంద సంస్థల ర్యాలీ

పర్యావరణ పరిరక్షణకు తదుపరి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, వాతావరణానికి అత్యంత ప్రాముఖ్యతనివ్వాలని కోరుతూ పదివేల మంది కార్యకర్తలు లండన్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. 350కి పైగా పర్యావరణ సంస్థలకు చెందిన కార్యకర్తలు ఐక్యంగా పార్క్‌లేన్‌ నుండి పార్లమెంట్‌ వరకు చేపట్టిన ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 

వాటిలో నేషనల్‌ ట్రస్ట్‌, వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్ల్యుడబ్ల్యుఎఫ్‌) వంటి స్వచ్ఛంద సంస్థలు, అలాగే జస్ట్‌ స్టాప్‌ ఆయిల్‌, ఎక్స్‌టెన్షన్‌ రెబెలియన్‌ వంటి ప్రత్యక్షంగా చర్యలు చేపట్టే సంస్థలు ఉన్నాయి. ఈ ర్యాలీ ప్రారంభానికి ముందు పర్యావరణ వేత్త క్రిస్‌ పాక్చమ్‌ మాట్లాడుతూ.. ”ప్రభుత్వాల ప్రేమ పూర్వకమైన మాటలు విన్నాము, అందమైన ప్రకృతి విధ్వంసమవుతున్నప్పటికీ వాగ్దానాలను అమలు చేయకపోవడం చూశాము” అని గుర్తు చేశారు. 

పర్యావరణాన్ని విధ్వంసం నుండి రక్షించడానికి తదుపరి ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు ఇప్పుడు సమయం వచ్చిందని ఆయన చెప్పారు. 2022లో ప్రస్తుత పాలక కన్జర్వేటివ్‌ ప్రభుత్వం 2030 నాటికి పర్యావరణ నష్టాన్ని అరికట్టడానికి చట్టబద్ధంగా కట్టుబడి ఉంటామన్న లక్ష్యంపై సంతకం చేసింది. అయితే వన్యప్రాణులు క్షీణించడంతో పాటు మొత్తం 23 లక్ష్యాలను పూర్తి చేయడంలో విఫలమైందని ప్రభుత్వ సొంత నిఘా సంస్థ స్పష్టం చేసింది.

ఈ ప్రభుత్వం పర్యావరణ సంక్షోభాన్ని అరికట్టేందుకు చొరవ చూపకపోగా, ప్రకృతికి సహజంగా కొంత రక్షణగా ఉన్న వాటిని కూడా వేగంగా బలహీనం చేస్తోందని కన్జర్వేటివ్‌ శాస్త్రవేత్త, ఎక్స్‌ఆర్‌ కార్యకర్త చార్లీ గార్డనర్‌ పేర్కొన్నారు. ప్రకృతిపై కనికరం లేకుండా దాడి చేస్తోందని మండిపడ్డారు. ఎలాగైనా విధ్వంసాన్ని ఆపాలని దేశవ్యాప్తంగా ప్రజలు ముందుకు వస్తున్నారని తెలిపారు. .

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. బ్రిటన్‌లో 1970 నుండి సగటున 19 శాతం పక్షి జాతులు క్షీణించాయని, ఆరుజాతుల్లో ఒకటి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ప్రస్తుత పరిస్థితిని ఆశాజనకంగా మార్చగలమన్న విశ్వాసం ఉందని, సమస్యలు తెలుసు, వాటి పరిష్కారం కూడా తెలుసునని రాయల్‌ సొసైటీ ఫర్‌ ది ప్రొటెక్షన్‌ ఆఫ్‌ బర్డ్స్‌ (ఆర్‌ఎస్‌పిబి) ఎగ్జిక్యూటివ్‌ చీఫ్‌ బెక్సీ స్పియట్‌ పేర్కొన్నారు.

కానీ పర్యావరణం, వాతావరణ సంక్షోభాన్ని అరికట్టేందుకు తగిన స్థాయిలో, తగినంత వేగంగా చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీల రాజకీయ నేతలు పర్యావరణాన్ని పునరుద్ధరించేందుకు వేగంగా చర్యలు చేపట్టాల్సి వుందని, బలమైన నిబద్ధత చూపాల్సి వుందని సూచించారు. లేకుంటే… మనుషులతో పాటు అన్ని జాతులు అంతరించి పోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని హెచ్చరించారు.