నైరుతి రుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోకి రుతుపవనాలు రావడంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నట్లు రాష్ట్ర విపత్తుల సంస్థ ప్రకటించింది. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతటా ఈ రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది.
దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతోంది. జూన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే వీలుంది. రేపు మోస్తరు వర్షాలు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది.
ఆదివారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.7మిమీ, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47.7మిమీ, చిత్తూరు జిల్లా పుంగనూరులో 33మిమీ, కాకినాడ జిల్లా గండేపల్లిలో 23.2మిమీ, అల్లూరి జిల్లా అనంతగిరిలో 22మిమీ, కాకినాడ జిల్లా పెదపూడిలో 20.2మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు.
ఏపీలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవర్తన ప్రభావంతో రాగల 3 రోజులు అక్కడక్కడా భారీవర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జూన్ ఏడో తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరింత విస్తరించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు నైరుతి పవనాల రాక కాస్త ఉపశమనం కలిగించింది.

More Stories
ఏపీలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
1500 ఏళ్ల భావన్నారాయణ స్వామి రథం వేలం
28న అమరావతిలో 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన