
ఏపీ చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ధిలో టాప్ ఉండేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పట్టాలు తప్పిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు డి. పురందేశ్వరిలతో కలిసి పాల్గొన్న ప్రధాని మోదీ 5 ఏళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా, అప్పుల ఊబిలో నెట్టేసిందని ధ్వజమెత్తారు.
దేశంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ప్రతిచోటా ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందన్న మోదీ.. మే 13వ తేదీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పారు. గోదావరి మాతకు ప్రణామాలు, ఈ నేల మీద ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారు. ఇక్కడి నుంచే కొత్త చరిత్ర లిఖించబోతున్నామంటూ ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు.
ప్రజల మంచి కోసం పని చేసే ఏకైక గ్యారెంటీ ఎన్డీఏ అని పేర్కొంటూ జగన్ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పనులన్నీ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కారు పూర్తి చేస్తుందని భరోసా ఇచ్చారు. ఒకవైపు కాంగ్రెస్ మరో వైపు వైసీపీ ఉందని చెబుతూ కాంగ్రెస్ గెలవక ముందే ఓటమి ఒప్పుకుంటే, వైసీపీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే తిరస్కరిస్తున్నారని ప్రధాని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో, రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ఉండాలని స్పష్టం చేశారు.
వైసీపీ పాలనలో అవినీతిని జెట్ స్పీడ్తో పరిగెత్తించిందని ప్రధాని మోదీ విమర్శించారు. జగన్ పాలనలో అభివృద్ధి సున్నా, అవినీతి వందశాతం అని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని చెప్పారు. ఏపీలో ప్రతిభావంతులైన యువత ఉన్నారని, టెక్నాలజీలో రాష్ట్ర యువత శక్తిని ప్రపంచం గుర్తించిందని కొనియాడారు.
కేంద్ర ప్రాజెక్టుల అమలును రాష్ట్ర ప్రభుత్వం కావాలనే జాప్యం చేసిందని సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. పదేళ్ల క్రితం దేశాన్ని కాంగ్రెస్ అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు. ఈడీ అంటూ గగ్గోలు పెడుతున్న ఇండియా కూటమి నేతల వద్ద గుట్టల కొద్దీ డబ్బు బయట పడుతోందజిని పేర్కొన్నారు. ఆ నేతల డబ్బును మెషీన్లు కూడా లెక్కపెట్టలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు.
మూడు రాజధానుల పేరిట మోసం
మూడు రాజధానులు చేస్తామని చెప్పిన సీఎం జగన్ ఏపీని లూటీ చేశారని ప్రధాని మోదీ విమర్శించారు. మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు మద్యం సిండికేట్గా తయారైందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో అవినీతి తప్ప ఆర్థిక నియంత్రణ లేదని ధ్వజమెత్తారు. వైసీపీ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.15 వేల కోట్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని ఆరోపించారు. రాజధానికి కేంద్రం రూ.15 వేల కోట్లు ఇవ్వాలనుకుందని, కానీ ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందుకోలేకపోయిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి గతి తప్పిందని.. ఇంకా చెప్పాలంటే ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనం బాట పట్టించిందని ప్రధాని మోదీ విమర్శించారు.
శ్రీరామ చంద్రుణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకొచ్చిన వ్యక్తి, భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినా వ్యక్తి ప్రధాని మోదీ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. భారతదేశానికి అభివృద్ధితో పాటు, గుండె ధైర్యం కావాలని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన వ్యక్తి, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ ను బలమైన దేశంగా నిలబెట్టిన వ్యక్తి ప్రధాని మోదీ అని కొనియాడారు.
కేంద్ర పథకాలను వైసీపీ ప్రభుత్వం పేర్లు మార్చుకుని, జగన్ పేరు పెట్టుకుందని విమర్శించారు. అవి కూడా సక్రమంగా అమలుచేయడం లేదని మండిపడ్డారు. మోదీ పాలనలో దేశమంతా అమృత ఘడియలు ఉంటే, ఏపీలో వైసీపీ పాలనలో విష ఘడియలు నడుస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాబోతుందని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. భారత్ ప్రపంచంలో మూడో స్థానానికి చేసుకోనుంది, రానున్న రోజుల్లో ప్రపంచ అగ్రశక్తిగా అవతరించనుందని చెబుతూ దీనికోసం తామంతా నరేంద్ర మోదీతో కలిసి నడుస్తున్నామని తెలిపారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్