
పోలవరం కల సాకారానికి పునరావాస ప్యాకేజీ అమలుకోసం ప్రత్యేక సెస్ చెల్లించేందుకు 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ముందుకు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ప్రభుత్వ ఖజానాకు తాను స్వయంగా రూ.కోటి విరాళం ఇవ్వగలనని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు ప్రతి కొనుగోలుపై ఒక పైసా మాత్రమే ప్రత్యేక సెస్‌గా చెల్లిస్తే, కేవలం ఆరు నెలల్లో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అవసరమైన రూ.33,000 కోట్లు సమీకరించవచ్చని పోలవరంలో మంగళవారం జరిగిన వారాహి విజయభేరి బహిరంగసభలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జీవనాధారంగా చెప్పుకునే పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు 2020 నాటికి పూర్తి చేయాలని భావించి టీడీపీ హయాంలో 70 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. అయితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 5 శాతం మాత్రమే పనులు జరగడంతో ఈ ప్రాజెక్ట్ పనులు వెనుకబడ్డాయి. తాము ప్రస్తుత ఎన్నికలలో అధికారంలోకి వస్తే త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని టిడిపి, జనసేన, బిజెపి కూటమి స్పష్టమైన ప్రకటన చేశాయి.
ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ అమలులో మరింత జాప్యం తగదని పేర్కొంటూ 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని పవన్ కల్యాణ్ కొత్త గడువును విధించారు. దీనిని సవాలుగా తీసుకుని, పూర్తి చేయడానికి తమ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి చేయడం కంటే పునరావాస ప్యాకేజీని అమలు చేయడం చాలా కష్టమని కేంద్ర ప్రభుత్వ అధికారులు తనతో చెప్పారని ఈ సందర్భంగా తెలిపారు.
ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు జీవనోపాధి మరియు భవిష్యత్తుకు భరోసా కల్పించే పోలవరం ప్రాజెక్టు కారణంగా ఉనికికి ముప్పు ఏర్పడుతున్న 1.65 లక్షల మంది నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అవసరం అని తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రజలను అనుమతించేవారని, ప్రతి ఒక్కరూ వచ్చి పనుల గురించి తెలుసుకునేవారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.
అయితే, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది నిషేధిత ప్రాంతంగా మారిందని విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి రాగానే కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమీక్షిస్తామని, పోలవరంను ఓ జిల్లా కేంద్రంగా ఉండేవిధంగా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు