లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో … కర్నాటకలో భారీగా అక్రమ నగదు, బంగారం బయటపడటం తీవ్ర కలకలం రేపింది. బళ్లారిలోని ఓ వ్యాపారి ఇంట్లో జరిపిన సోదాల్లో భారీగా నోట్ల గుట్టలు, రూ.కోట్లు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాల సంచులు దొరికాయి.
బళ్లారిలో ఓ వ్యాపారి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టగా, రూ.7.6 కోట్ల నగదు, బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు. బళ్లారిలో హవాలా కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం రావడంతో బ్రూస్‌పేట్ పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక ఆభరణాల వ్యాపారి నరేశ్ సోనీ ఇంట్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు.
లెక్కల్లోకి రాని భారీ నగదు, ఆభరణాలను గుర్తించారు. రూ.5.6 కోట్ల కరెన్సీ, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలు, 3 కిలోల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో వీటిని తీసుకొచ్చి ఉంటారన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యాపారి నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి అందజేస్తామని, అనంతరం ఐటి అధికారులు దీనిపై తదుపరి దర్యాప్తు చేపడతారని తెలిపారు. పోలింగ్ దగ్గరపడుతున్న వేళ ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కర్నాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు రెండు దశల్లో ఏప్రిల్ 26, మే 4వ తేదీన పోలింగ్ జరగనుంది.

More Stories
ఇక వారానికి 48 గంటలే పని.. ఓవర్‌టైమ్ కు అదనం
నైతిక ఉల్లంఘనలపై 1,000 మందిని తొలగించిన ఎయిర్ ఇండియా
కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచిన కంపెనీలు