
కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా సృష్టించిన అవాస్తవ కంటెంట్ ను సోషల్ మీడియాలో వ్యాపింపజేసి, భారత్ లో త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను ప్రభావితం చేయడానికి చైనా ప్రయత్నించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలలో జరగనున్న ఎన్నికలు కూడా ఇలాంటి కంటెంట్ వల్ల ప్రభావితమవుతాయని మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన నివేదిక హెచ్చరించింది.
దాదాపు 64 దేశాల్లో ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయని, ఈ నేపథ్యంలో ఎఐతో జోక్యానికి అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ థ్రెట్ అనాలసిస్ సెంటర్ జనరల్ మేనేజర్ క్లింట్ వాట్స్ బ్లాగ్ పోస్టు పెట్టారు. ఓటర్ల మధ్య పలు అంశాల్లో విభజన తీసుకొచ్చి, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చేలా నకిలీ ఖాతాలను చైనా ఉపయోగిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తన లక్ష్యాల సాధనకు ఉత్తర కొరియాతో కలిసి చైనా ఎఐ వినియోగాన్ని పెంచిందని పేర్కొన్నారు.
మీమ్స్, వీడియోలు, ఆడియోల ఏఐ జనరేటెడ్ కంటెంట్ ను సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేసి, తమకు అనుకూలంగా ఫలితాలు రావడానికి చైనా ప్రయత్నించే అవకాశముందని మైక్రోసాఫ్ట్ నివేదిక తెలిపింది. 2023 జూన్ నుంచి చైనా, ఉత్తర కొరియాల నుంచి అనేక ముఖ్యమైన సైబర్ సంబంధిత అనుమానిత ధోరణులను గమనించామని ఆ నివేదిక తెలిపింది.
దక్షిణ పసిఫిక్ దీవుల్లోని దేశాలు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని ప్రాంతీయ ప్రత్యర్థులు, యుఎస్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ లక్ష్యంగా చైనా ఈ సైబర్ కుట్రలు చేస్తోందని వెల్లడించింది. ఫ్లాక్స్ టైఫూన్ అనే చైనీస్ సైబర్ యాక్టర్ అమెరికా-ఫిలిప్పీన్స్ సైనిక విన్యాసాలకు సంబంధించిన సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
ఫిలిప్పీన్స్, హాంకాంగ్, భారత్, అమెరికాల్లో కూడా పలు సంస్థలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఇటీవల ప్రధాని మోదీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీ అయిన కొన్ని రోజుల తర్వాత మైక్రోసాఫ్ట్ నుంచి ఎఐపై హెచ్చరికలు రావడం గమనార్హం.
More Stories
ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి వచ్చే వారం భారత్ లో పర్యటన
అక్టోబర్ 26 నుంచి భారత్- చైనాల మధ్య విమాన సర్వీసులు
విదేశీ విద్యార్థులపై ట్రంప్ కొత్త మెలిక