వాలంటీర్ వ్యవస్థ చుట్టూ ఏపీ రాజకీయాలు

వాలంటీర్ వ్యవస్థ చుట్టూ ఏపీ రాజకీయాలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకూ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు వేరే విధంగా చేయడం ద్వారా అధికార పార్టీకి రాజకీయంగా బలమైన సాధనంగా మలచుకున్నారు. అధికార పార్టీ యంత్రాంగాన్ని సహితం పక్కన పెట్టి, వలంటీర్ల ద్వారానే ఎన్నికలలో గెలుపొందేందుకు ఎత్తుగడలు వేశారు. దానితో గత ఎన్నికలలో జగన్ గెలుపుకోసం తీవ్రంగా కృషిచేసిన అనేకమంది గ్రామస్థాయి నాయకులు ఇప్పుడు మౌనవ్రతం పాటిస్తున్నారు.
 
అయితే ఎన్నికల సమయం కావడం, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రతిపక్షాలు ఈ వ్యవస్థను ఎన్నికలకోసం ఉపయోగించుకొనే ఎత్తుగడల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టాలని ఆదేశించింది. దీనిపై వైసీపీ నేతలు అసహనానికి గురవుతున్నారు. 
 
పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్నీ ప్రజల చెంతకు చేరుస్తున్న వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు బృందం తప్పుడు ఫిర్యాదులతో నిలుపుదల చేయించిందని ఆరోపణలు గుప్పిస్తూ వారిని ప్రతిపక్షాలపైకి  ఎక్కుపెట్టే ప్రయత్నం చేపట్టారు. కొన్ని చోట్ల వారితో మూకుమ్మడిగా రాజీనామాలు చేయిస్తూ రాజకీయంగా అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
 
వలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని ఆపివేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించగానే ఇదివరలో ఇంటిని పెన్షన్ల మొత్తం అందజేసే పద్దతికి స్వస్తి చెప్పి, ఏప్రిల్ 1కు బదులు 3 నుండి గ్రామా సచివాలయంకు వచ్చి పెన్షన్ల మొత్తం తీసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా వలంటీర్ల వ్యవస్థ లేకపోతే సంక్షేమ పధకాలు అందబోవనే సంకేతం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు.
 
అయితే, ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన టిడిపి నేతలు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేయకుండా, కొనసాగిస్తామని ప్రచారం చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో ఈ విషయమే పదే పదే చెబుతున్నారు. తద్వారా వాలంటీర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్ ప్రభుత్వ పథకాల్ని ఇప్పటిలాగానే వాలంటీర్ల ద్వారా అమలయ్యేలా చేస్తామనే స్పష్టం చేస్తున్నారు. పైగా, వాలంటీర్లకు ప్రభుత్వ పరంగా మరింత మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ పరిణామం సహజంగానే వైసీపీకి కలవరం కలిగిస్తోంది. 
 
ఎందుకంటే.. ఈ వాలంటీర్ల వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని, ప్రజలు తమకు ఓటు వేస్తారని వైసీపీ ఆశలు పెంచుకుంది. అలాంటిది టీడీపీ అధికారంలోకి వచ్చినా, వాలంటీర్లు కొనసాగుతారని అనిపిస్తే, ఎన్నికల్లో తమకు అనుకూలంగా వ్యవహరిస్తారా? అనే అనుమానం వైసీపీ నేతల్లో ఏర్పడింది. ఈ విధంగా వాలంటీర్ల వ్యవస్థ ఏపీ ఎన్నికల్లో కీలక అంశంగా ఉంది. 
 
వాలంటీర్లకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుండడంతో అన్ని పార్టీలు వారిపై దృష్టి సారిస్తున్నాయి. వాలంటీర్ల సేవల్ని బలవంతంగా ఆపించేసి, పథకాల అమలును అడ్డుకుంటూ చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తూ వాలంటీర్లకు టీడీపీ పట్ల వ్యతిరేక భావన వచ్చేలా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు సహితం బెడిసి కొడుతున్నాయి.
 
టిడిపిని అప్రదిష్టపాలు చేయడం కోసం గ్రామా, వార్డ్ సచివాలయంలకు వచ్చి పెన్షన్ మొత్తాలను తీసుకెళ్లాలని చేసిన ప్రకటన ప్రభుత్వం పట్ల ప్రతికూల సంకేతాలు పంపుతుందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఫించన్ల పంపిణీపై రివైజ్డ్ మార్గదర్శకాలు ఇస్తామని చెప్పారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయొచ్చని సూచించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదివరలో వాలంటీర్లపై అనుచిత వాఖ్యలు చేసి దుమారం రేపైనా తర్వాత ఈ విషయంలో మౌనం వహిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు వారిని కొనసాగిస్తామనీ, ఒక్కర్ని కూడా తొలగించబోమని చెబుతున్నారు. అంతేకాదు.. వాలంటీర్ల జీతాలు కూడా పెంచుతానని అంటున్నారు. ఇది వైసీపీకి సమస్యగా మారుతోందనే అభిప్రాయం కలుగుతుంది.