పీవీతో సహా నలుగురికి భారత రత్న ప్రధానం

పీవీతో సహా నలుగురికి భారత రత్న ప్రధానం
ఢిల్లోని రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఐదుగురికి భారతరత్న ప్రకటించి సంచలనం సృష్టించింది. దీంతో దేశ ప్రథమ మహిళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అవార్డుల ప్రదానం చేశారు. 
 
మాజీ ప్రధానమంత్రిలు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్ సింగ్.. హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌, బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీలకు ఈసారి భారతరత్న వరించింది. ఇటీవల ప్రకటించిన ఈ పురస్కారాలను శనివారం ప్రదానం చేశారు.

 
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు భారతరత్న పురస్కారాన్ని స్వీకరించారు. చ‌ర‌ణ్‌సింగ్ త‌ర‌పున ఆయ‌న మ‌నువ‌డు జ‌యంత్ సింగ్, స్వామినాథ‌న్ త‌ర‌పున ఆయ‌న కుమార్తె నిత్యా రావు, క‌ర్పూరీ ఠాకూర్ త‌ర‌పున ఆయ‌న కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్ భార‌త‌ర‌త్న అందుకున్నారు.
 
ఇక బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం స్వయంగా ఆయన ఇంటికే వెళ్లి భారతరత్న ప్రదానం చేయనున్నారు. ఇక రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన భారతరత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, జై శంకర్‌, కిషన్‌ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు హాజరయ్యారు.
 
వివిధ రంగాల్లో దేశానికి సేవలందించిన ఐదుగురు ప్రముఖులకు ఈ ఏడాది మూడు విడతల్లో భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో నలుగురికి మరణానంతరం భారతరత్న ప్రకటించగా.. వారి కుటుంబసభ్యులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
 
పీవీ నరసింహరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, దేశ ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆర్థిక సంస్కరణలకు బీజం వేసింది పీవీ హయాంలోనే. ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు ఎప్పటికి గుర్తుండిపోతాయి. దేశాన్ని ఆర్థికంగా పురోగమింపజేయడానికి బలమైన పునాది వేయడంలో పీవీ కీలకపాత్ర పోషించారు.