ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు గత వారం బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్జరీ తర్వాత వేగంగా కోలుకుంటున్నారు. 
ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితి మెరుగవుతున్నట్లు సద్గురు ఓ సందేశంలో తెలిపారు. ఆసుపత్రిలో మంచంపై తలకు బ్యాండేజ్‌తో ఎంతో ప్రశాంతంగా దినపత్రిక  చదువుతున్న ఓ షార్ట్ వీడియో క్లిప్‌ను ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షేర్ చేశారు. వేగంగా కోలుకుంటున్నట్లు వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు సద్గురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.  66 ఏండ్ల జగ్గీ వాసుదేవ్ గత నాలుగు వారాల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఈ నెల 8న జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 
అయితే ఈ నెల 17న మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడంతో వెంటనే ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అదే రోజు వైద్యుల బృందం ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది. ప్రస్తుతం సద్గురు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సద్గురు కుమార్తె రాధే జగ్గీ ఎప్పటికప్పుడు తెలుపుతున్నారు.
                            
                        
	                    
More Stories
నైతిక, మానవ-కేంద్రీకృత కృత్రిమ మేథస్సు కోసం భారత్
హర్మన్‌ప్రీత్ సేనకు బీసీసీఐ రూ. 51 కోట్ల నజరానా
భారత మహిళల జట్టుకు తొలిసారి వన్డే ప్రపంచకప్ కైవసం