ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై సోదాలు నిర్వహించిన ఈడీ, ఐటీ అధికారులు ఆమెను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. సోదాల్లో భాగంగా కవిత నుంచి సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఇదే రాత్రి ఆమెను ఢిల్లీకి తరలించనున్నట్టు సమాచారం. 
 
సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు నివాసంలోకి కనీసం లాయర్లను కూడా అనుమతించ లేదు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్న అనంతరం కవితను అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన పదిమంది అధికారుల బృందం కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. కవిత, ఆమె సహాయకుల సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కవిత భర్త ఆస్తులపై కూడా ఇడి అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
 
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుల్లోనే ఈ సోదాలు జరిగిన్నట్లు తెలుస్తున్నది. ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తుండటంతో పోలీలు భారీగా ఆమె ఇంటికి చేరుకున్నారు. కవిత నివాసానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుని ఆందోళన చేపట్టారు. మోదీకి , ఈడీ అధికారులను వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత హస్తం ఉందనే అనుమానంతో మరోసారి కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఆమె రెండు మూడుసార్లు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు కూడా. ఆ తరువాత కూడా ఆమెకు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ నోటీసులు అందాయి. అయితే, సుప్రీంకోర్టులో తన పిటీషన్ విచారణలో ఉన్నందున హాజరు కాలేనని హాజరు కావడం లేదు.
దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె. కవిత కీలక పాత్ర పోషించినట్టు సంచలన ఆరోపణలు వచ్చాయి. ఈ పాలసీలో కవితకు సుమారు రూ. 100 కోట్ల వరకు ముడుపులు ముట్టినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసుతో సంబంధమున్నట్టుగా భావించిన పలువురిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా కవితకు సంబంధించిన మూలాలు బయటపడినట్టుగా అధికారులు తెలిపారు.

ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులు సైతం కవితకు సమన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలోనే ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ  అలా జరగలేదు. ఆ తరువాత కవిత పేరును ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచినట్లు వార్తలు సైతం వెల్లువెత్తాయి.  ఇదివరకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ఎంపీ సంజయ్ సింగ్ విచారణను ఎదుర్కొంటున్నారు. జైలు జీవితాన్ని గడుపుతోన్నారు. మరికొందరు ఇతర పార్టీల నాయకులూ అరెస్ట్ అయ్యారు.
కాగా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ నేరం చేయనప్పడు కవితకు భయమెందుకు? అని ప్రశ్నించారు. ఈడీ విచారణకు కవిత సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు. ఇన్నాళ్ళూ కవిత విచారణకు సహకరించలేదన్న ఆయన కవిత సహకరించనందుకే ఈడీనే ఆమె ఇంటికి వెళ్లిందని తెలిపారు. కక్షసాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుపోతాయని చెప్పారు.