
ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగేందుకు నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకుండా దేశం కోసం పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి గెలుపొందాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ పిలుపిచ్చారు. ఈ గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రంలో బీజేపీని గెలిపించాలని ఖుష్బు కోరారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన బైక్ ర్యాలీని ఆమె ప్రారంభిస్తూ కంటోన్మెంట్ సమస్యను తీర్చేది కేంద్రమేనని, ఇక్కడి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
400 సీట్లతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ విజయఢంకా మోగించడం ఖాయమని ఖుష్బు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ హయాంలో డిజిటల్ రంగంలో, విమానయాన, రైల్వే, త్రివిధ దళాలు, జాతీయ రహదారులు, ఇలా అన్ని రంగాల్లో వృద్ధి సాధించామని ఆమె వివరించారు. మహిళలు, యువతకు అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించినట్లు కుష్బు తెలిపారు.
కరోనా విపత్కర సమయంలో అందరికీ ఉచితంగా టీకాలు ఇచ్చామని చెబుతూ ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొందని ఆమె చెప్పారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛ కల్పించారని ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో గొప్ప అవకాశాలను కల్పించిందని చెబుతూ ఇక కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన తప్ప.. దేశానికి చేసిందేమీ లేదని ఖుష్బు విమర్శించారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత