మంగళవారం పిఎంఎల్-ఎన్ సీనియర్ నేత ఇషాక్ దార్ నివాసంలో జరిగిన సమావేశంలో రెండు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు పాల్గొన్నారు. పిపిపి ప్రతినిధి బృందం నుండి మురాద్ అలీ షా, కమర్ జమాన్ కైరా, నదీమ్ అఫ్జల్ చాన్, ఇతర నేతలు సమావేశానికి హాజరైనట్లు స్థానిక మీడియా తెలిపింది. పిపిపిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి సంబంధించిన అంశాలపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు పిఎంఎల్-ఎన్ నేత ఆజం నజీర్ విలేకర్లకు తెలిపారు. ఇదిలావుండగా, ముత్తెహిదా క్వామి మూవ్మెంట్ (పాకిస్తాన్) పిఎంఎల్-ఎన్‌కు మద్దతునిస్తామని సోమవారం ప్రకటించింది. ఈ పార్టీకి 17సీట్లు వున్నాయి.
ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో దేశంలో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు పిఎంఎల్-ఎన్, పిపిపి సమన్వయ కమిటీల మధ్య ఇవి ఐదవ రౌండ్ చర్చలు కావడం గమనార్హం. సోమవారం మూడు గంటలపాటు కొనసాగిన చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
పిఎంఎల్-ఎన్, పిపిపి రెండూ తిరిగి రాత్రి పదిగంటలకు సమావేశానికి అంగీకరించాయి. అయితే సమావేశం జరగలేదు. చివరికి పిపిపితో బుధవారం చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని సోమవారం రాత్రి 11 గంటలకు పిఎంఎల్-ఎన్ ప్రకటించి సమావేశాన్ని ముగించింది. అనంతరం పిఎంఎల్-ఎన్ నేత అజం నజీర్ తరార్ మీడియాతో మాట్లాడుతూ చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, పిపిపిని కేబినెట్లో చేర్చే అంశంపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

More Stories
ప్రపంచ అభివృద్ధి ప్రమాణికాలపై పునరాలోచన
జి20 సదస్సుకు అమెరికా, రష్యా, చైనా అధినేతలు దూరం!
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో అరెస్ట్