అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవ దాతల  అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు. అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. అవయవ దానాలకు ముందుకు వచ్చేలా ప్రజలను ఒడిశా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

 ఇందులో భాగంగా సీఎం నవీన్‌ పట్నాయక్ 2019లో గంజాం జిల్లాకు చెందిన సూరజ్ పేరు మీద వార్షిక అవార్డును ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఆ బాలుడి అవయవాలు దానం చేసేందుకు అతడి తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. గుండె, కాలేయం, మూత్రపిండాలు, కళ్ళు దానం చేసి పలువురి ప్రాణాలు కాపాడటంతోపాటు మరో జీవితాన్ని ప్రసాదించారు. 

దీంతో సీఎం నవీన్‌ పట్నాయక్‌ స్వయంగా సూరజ్ తల్లిదండ్రులను కలుసుకున్నారు. వారి స్ఫూర్తిదాయక చర్యకు గుర్తింపుగా రూ. 5 లక్షలు అందజేశారు. నాటి నుంచి ప్రతి ఏటా సూరజ్ పేరు మీద వార్షిక అవార్డును అందజేస్తున్నారు.

కాగా, తమిళనాడు ప్రభుత్వం కూడా అవయవ దానాలను ప్రోత్సహిస్తున్నది. అవయవ దాతల అంత్యక్రియలను ప్రభుత్వ గౌరవంతో నిర్వహిస్తామని సీఎం ఎంకే స్టాలిన్‌ గత ఏడాది ప్రకటించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దీనిని స్ఫూర్తిగా తీసుకున్నారు. అవయవ దాతల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని గురువారం ప్రకటించారు.