మావోల కాల్పుల్లో ముగ్గురు సీఆర్ పీఎఫ్ కమాండోల మృతి

మావోల కాల్పుల్లో ముగ్గురు సీఆర్ పీఎఫ్ కమాండోల మృతి
మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు మరోసారి రెచ్చిపోయారు. ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లా టేకులగూడెంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) క్యాంప్‌పై దాడికి తెగబడ్డారు. దీంతో  పోలీసులు, మావోల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి.  ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు.
 
మావోల కార్యకలాపాల పర్యవేక్షణకు టేకులగూడెం గ్రామంలో సెక్యూరిటీ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జోనగూడ-అలిగూడ ప్రాంతంలో పెట్రోలింగ్, సోదాలు చేస్తున్న కోబ్రా- ఎస్టీఎఫ్-డీఆర్‌జీ దళాలపై మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడ్డాయి. 
 
ఈ ఘటనలో తీవ్ర గాయాలకు గురయిన జవాన్లను  చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జగ్దల్‌పూర్ రిఫరల్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన జవాన్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నక్సల్స్ కాల్పులు జరపడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ధీటుగా బదులిచ్చాయి. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల ఒత్తిడిని గమనించిన మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు.
 
కోబ్రా 201 బెటాలియన్, సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్ కు చెందిన బృందం ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ఏర్పాటు కోసం ఆ ప్రాంతంలో పని చేస్తుండగా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. 2021లో 21 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతంలోనే ఈ ఎదురు కాల్పులు కూడా జరిగాయని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్ రాజ్ తెలిపారు.
 
2021లో జరిగిన టేకులగూడెం ఎన్‌కౌంటర్‌లో భారీ నష్టాన్ని చవిచూసినా.. శాంతి భద్రతలు, అభివృద్ధి కోసం గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. భద్రతా బలగాలపై మావోయిస్ట్‌ల జరిపిన ఆకస్మిక ఘోరమైన దాడుల్లో ఇదీ ఒకటి. ఏప్రిల్ 2021లో బిజాపూర్ జిల్లాలో మావోయిస్ట్ అగ్రనేత కోసం 2 వేల మంది భద్రతా సిబ్బంది గాలిస్తుండగా..వారిపై మావోలు దాడిచేశారు.
 
అంతకు ముందు భద్రతా దళాలు రెండు ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ లను స్వాధీనం చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో ఒకటి 5 కిలోలు, మరొకటి 3 కిలోల బరువున్న ఈ బాంబులను అమర్చినట్లు పోలీసులు తెలిపారు.పెట్రోలింగ్ సమయంలో ఈ ప్రాంతం గుండా వెళ్లే భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు పదార్థాలను అమర్చారు. అనంతరం ఆ బాంబులను బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్  నిర్వీర్యం చేసింది.

కాగా.. మావోల దాడిచేసిన ఈ జవానుల భద్రతా శిబిరాన్ని ఈ మధ్యనే ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్లప్పుడూ ఘర్షణలు చోటు చేసుకునే ఈ ప్రాంతంలో స్థానిక కమ్యూనిటీ శ్రేయస్సును మెరుగుపరిచేందుకు, వారికి ప్రాథమిక సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో.. ఈ ఏడాది జనవరి 30వ తేదీన ఈ భద్రతా శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే.. ప్రారంభించిన కాసేపటికే మావోలు అదును చూసి ఈ దాడికి పాల్పడ్డారు. కాగా.. ఛత్తీస్‌గడ్‌లో పలు జిల్లాల్లో అధిక భాగం నక్సలైట్ల ప్రాబల్యం ఉన్నది. ఇందులో సుక్మా జిల్లా ఒకటి.