మాలే మేయర్ ఎన్నికల్లో అధ్యక్షునికి చుక్కెదురు

మాలే మేయర్ ఎన్నికల్లో అధ్యక్షునికి చుక్కెదురు
భారత్‌తో దౌత్యవివాదం నడుస్తోన్న వేళ మాల్దీవులు అధికార పార్టీకి షాక్ తగిలింది. మాల్దీవులు రాజధాని మాలే మేయర్ పదవి కోసం నిర్వహించిన ఎన్నికల్లో భారత్ అనుకూల పక్షమైన మాల్దీవియయన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ) ఘన విజయం సాధించింది. ఎండీపీ అభ్యర్థి ఆడమ్ అజిమ్ మాలే కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు. 
 
ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికయ్యేంత వరకు మహ్మద్ ముయిజ్జూ మాలే మేయర్‌గా పని చేయగా ఇప్పుడు ఆ పదవిని ప్రతిపక్షం సొంతం చేసుకోవడం విశేషం. భారత్ ప్రభావంతోనే అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని భావిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు మహ్మద్ సోలిహ్ నాయకత్వంలోని ఎండీపీ భారత్ అనుకూల పార్టీగా గుర్తింపు పొందింది. 
 
గత ఏడాది నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా అనుకూలుడైన మహ్మద్ ముయిజ్జూ మహ్మద్ సోలిహ్‌ను ఓడించి అధ్యక్ష పదవిని చేపట్టారు.  మేయర్ ఎన్నికల్లో 41 బాక్సులు లెక్కించే సమయానికి అజిమ్‌కు 5303 ఓట్ల ఆధిక్యం లభించింది. ముయిజ్జూకు చెందిన పీపుల్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి అయిషత్ అజిమ్ షాకూర్ వెనుకంజ వేశారు.

మాలే మేయర్ ఎన్నికల్లో పోలింగ్ తక్కువగా నమోదైంది. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం మాలేలో 54 వేల మందికిపైగా ఓటర్లు ఉండగా కేవలం 17,500 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాలే మేయర్‌గా ఎన్నికైన అజిమ్‌ పెద్ద సోదరుడు మహ్మద్ నజీమ్ కల్నల్‌గా పని చేసి రిటైరయ్యారు. 

 
మాల్దీవ్ నేషనల్ పార్టీ నాయకుడైన నజీమ్ ధంగేతి నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన సమయంలో మాల్దీవుల మంత్రులు నోరు పారేసుకోవడంతో పెను దుమారం చెలరేగింది.  ఈ వివాదం కొనసాగుతుండగానే మాల్దీవులు నూతన అధ్యక్షుడైన ముయిజ్జూ చైనా పర్యటనకు వెళ్లారు. ఐ
 
దు రోజుల చైనా పర్యటన ముగించుకొని మాలే తిరిగొచ్చిన ఆయన `మాది చిన్న దేశమే కావచ్చు.. కానీ మమ్మల్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు’ అంటూ పరోక్షంగా భారత్ పై ఘాటుగా విమర్శలు గుప్పించారు. మహ్మద్ ముయిజ్జూ చైనా పర్యటన నుంచి తిరిగి రాగానే మాలే మేయర్ ఎన్నికల ఫలితం రూపంలో ఊహించని షాక్ తగిలింది.