హెచ్‌-1బీ వీసాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

2024- 25 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌-1బీ వీసాల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు ఫిబ్రవరి నుంచి అవకాశం కల్పించనున్నట్లు అమెరికా ఇటీవల ప్రకటించింది. యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) కూడా హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్స్‌ ఆన్‌లైన్‌ కొలాబరేషన్‌, సబ్మిషన్‌లకు అవకాశం కల్పించే ఆర్గనైజేషనల్‌ అకౌంట్స్‌ను ప్రవేశపెట్టబోతున్నది. 
 
అకౌంట్‌ లభ్యత, రిజిస్ట్రేషన్‌ తేదీలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెలాఖరు నాటికి వెలువడే అవకాశం కనిపిస్తోంది.  పరిమితి లేని ఫైలింగ్స్‌, 2025 ఆర్థిక సంవత్సరం పరిమితి సీజన్‌ కోసం ఆర్గనైజేషనల్‌ అకౌంట్స్‌ను ప్రారంభించబోతున్నట్లు యూఎస్‌సీఐఎస్‌ ప్రకటించింది. 
 
హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్స్‌ కోసం సమన్వయంతో పని చేసి, తయారుచేసే అవకాశం ఆర్గనైజేషనల్‌ అకౌంట్స్‌లో కంపెనీ లేదా ఇతర వ్యాపార సంస్థల్లోని వ్యక్తులకు, వారి లీగల్‌ రిప్రజెంటేటివ్‌లకు ఉంటుందని తెలిపింది. నాన్‌ ఇమిగ్రెంట్‌ వర్కర్‌ కోసం దరఖాస్తు ఫారం ఐ-129 అని, ప్రీమియం ప్రాసెసింగ్‌ సర్వీస్‌ కోసం విజ్ఞప్తి కోసం ఫారం ఐ-907 అని తెలిపింది. 
 
ఈ ఫారాలను ఆర్గనైజేషనల్‌ అకౌంట్స్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దాఖలు చేయవచ్చు. ఎలక్ట్రానిక్‌ ఫైలింగ్‌ కోసం లీగల్‌ రిప్రజెంటేటివ్‌కు అధికారం ఇవ్వవచ్చు. సంప్రదాయ పద్ధతిలో కాగితంపై ముద్రించి, రాసిన ఫారం ఐ-129ను కూడా దాఖలు చేయవచ్చు. అయితే హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మాత్రం ఆన్‌లైన్‌లో మాత్రమే జరుగుతుంది. 
 
యూఎస్‌సీఐఎస్‌ ఆర్గనైజేషనల్‌ అకౌంట్స్‌పై ఈ నెల 23, 24 తేదీల్లో రెండు నేషనల్‌ ఎంగేజ్‌మెంట్‌ సెషన్స్‌ను నిర్వహిస్తుంది. హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్‌ పీరియడ్‌కు ముందే ఈ ప్రక్రియను ఏ విధంగా పూర్తి చేయాలో ఆర్గనైజేషన్లకు, వాటి లీగల్‌ రిప్రజెంటేటివ్‌లకు వివరిస్తుంది.