`అయోధ్య’ ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్‌

`అయోధ్య’ ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్‌
ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలయాన్ని ప్రారంభించి, ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుక కోసం యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ రాజకీయ పార్టీలతో పాటు ప్రముఖలను ఆహ్వానిస్తున్నది. 
 
అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్‌ను సైతం ట్రస్ట్‌ ఆహ్వానించింది.  అయితే, ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావడంతో సంశయంలో పడిన కాంగ్రెస్ పార్టీ చివరకు హాజరు కారాదని నిర్ణయించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. అయోధ్య ట్రస్ట్‌ ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సోనియా గాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తిరస్కరించారని వెల్లడించారు. 
 
మతం అనేది వ్యక్తిగత అంశమని పేర్కొంటూ రామాలయాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. అయోధ్య రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, ఎన్నికల కోసం అసంపూర్ణ ఆలయాన్ని ప్రారంభిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది.  ‘2019 సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి, శ్రీరాముడిని గౌరవించే లక్షలాది మంది మనోభావాలను గౌరవిస్తూ.. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి స్పష్టంగా ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఈవెంట్‌ ఆహ్వానాన్ని గౌరవపూర్వకంగా తిరస్కరించారు’ అని కాంగ్రెస్‌ పేర్కొంది.
 
అయితే, ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ చింతించాల్సి వస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్ సింగ్ పురి  రు. రామాలయ అంశంపై కాంగ్రెస్ పార్టీ మొదట్నించి ఇదే ధోరణి అవలంభిస్తోందని, ఈ విషయాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. 
 
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తమకు ఎంత మాత్రం ఆశ్చర్యం కలిగించలేదని బీజేపీ నేత నలిన్ కోహ్లీ  రు. అయోధ్యలో రామాలయం కోసం కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, సుప్రీంకోర్టు తీర్పును జాప్యం చేస్తూ వచ్చారని, ఈ క్రమంలో ఇప్పుడు రామమందిరం ప్రాణప్రతిష్ఠకు హాజరుకావడం లేదని చెప్పడంలో ఆశ్చర్యపడేదేమీ లేదని అన్నారు.
 
రామ్ లల్లా కార్యక్రమానికి హాజరుకాకూడదని కాంగ్రెస్ నాయకులు భావిస్తే అది వారిష్టమని  విశ్వ హిందూ పరిషద్ (విహెచ్‌పి) వ్యాఖ్యానించింది. ఇలా ఉండగా ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మాత్రం తాను అయోధ్యకు వెళతానని స్పష్టం చేశారు. అయితే తాను జనవరి 15న రామ్ లల్లా దర్శనం కోసం అయోధ్య వెళతానని, సరయూ నదిలో పుణ్యస్నానం ఆచరిస్తానని చెబుతూ తనకు ప్రాణప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానం అందచలేదని ఆయన తెలిపారు.