
బూత్ స్థాయిలో శ్రీరామ ప్రతిష్ఠను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని పార్టీ కార్యకర్తలకు బీజేపీ సూచించింది. అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా వీక్షించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు బీజేపీ తెలిపింది. అంతేకాకుండా, జనవరి 22న రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రాకుండా, ఈ భారీ స్క్రీన్ లపై వారి ఊర్లలోనే ఆ కార్యక్రమాన్ని వీక్షించేలా చేయాలని బీజేపీ ఆలోచిస్తోంది.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా దేశ వ్యాప్తంగా గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు, ఇతర భక్తులు అవసరమైన వారికి దుప్పట్లు పంపిణీ చేయడం, భోజనాలు ఏర్పాటు చేయడం వంటికి నిర్వహించాలని సూచిస్తోంది. ప్రజలు డబ్బు, ఆహారం లేదా పళ్లను కూడా విరాళంగా ఇవ్వవచ్చని తెలిపింది.
అయోధ్యలోని రామ్ లల్లా (బాల రాముడు) ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు ప్రధాన వేడుకకు వారం ముందు, అంటే జనవరి 16 న ప్రారంభమవుతాయి. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22న రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రధాన పూజలు నిర్వహించనున్నారు.
జనవరి 14 నుంచి 22 వరకు అయోధ్యలో అమృత్ మహోత్సవ్ జరగనుంది. 008 హుండీ మహాయజ్ఞం నిర్వహించి వేలాది మంది భక్తులకు అన్నదానం చేయనున్నారు. అయోధ్యకు తరలివచ్చే వేలాది మంది భక్తుల కోసం పలు టెంట్ సిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
10 వేల నుంచి 15 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తామని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. ఈ కార్యక్రమానికి వస్తున్నవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడ్తున్నారు. జనవరి 22న అయోధ్యలో జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రజలు తరలి రావద్దని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రజలకు, భక్తులను అభ్యర్థించారు.
వేలాదిగా తరలి రావడం వల్ల ఆ బాల రాముడికి ఇబ్బంది కలుగుతుందని, జనవరి 22 తరువాత ఎప్పుడైనా అయోధ్యకు వచ్చి, ఆ బాల రాముడిని దర్శించుకోవచ్చని ఆయన భక్తులకు సూచించారు. జనవరి 22న దేశ వ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లల్లో దీపాలను వెలిగించి, మరోసారి దీపావళి జరుపుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు.
More Stories
అన్ని రంగాల్లోనూ స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించాలి
లేహ్‌లో ఆందోళనల వెనుక కుట్ర.. నలుగురు మృతి
దంతెవాడలో లొంగిపోయిన 71 మంది మావోయిస్టులు