అంబటి రాయుడు రాజకీయాల నుంచి డకౌట్!

అంబటి రాయుడు రాజకీయాల నుంచి డకౌట్!
భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేయడానికి సుదీర్ఘ కాలం వేచి చూసి ఆఖరికి ‘ఏదో అలా వచ్చి వెళ్లిన’ క్రికెటర్‌గా మిగిలిపోయిన తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ కూడా ఒడిదొడుకులతోనే మొదలైనట్టుంది.  కొంతకాలంగా ‘ప్రజలకు సేవ’ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వస్తున్నాననంటూ సంకేతాలు ఇస్తూ ఎట్టకేలకు గత నెల 28న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న రాయుడు పది రోజుల్లోనే మనసు మార్చుకున్నాడు. 
 
రాజకీయాల నుంచి కొద్దిరోజులు విరామం తీసుకుంటున్నానని శనివారం ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా సంచలన ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. ‘వైఎస్సార్‌సీపీ పార్టీ నుంచి వైదొలుగుతున్నాను. కొంత కాలం నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. భవిష్యత్తు కార్యచరణను త్వరలో ప్రకటిస్తాను’అని అంబటి రాయుడు ట్వీట్ చేశారు.
 
గతేడాది ఐపీఎల్‌ ముగిసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రాయుడు సుమారు రెండేండ్లుగా ‘అనధికారిక రాజకీయ కార్యక్రమాల’లో చురుగ్గా పాల్గొంటున్నాడు. గుంటూరులోని తన సొంత నియోజకవర్గమైన పొన్నూరులో పలు సేవా కార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు బహిరంగంగానే మద్దతు ప్రకటించాడు. 
 
దీంతో రాయుడు వైఎస్సార్సీపీలో చేరడం పక్కా అని, పొన్నూరు నియోజకవర్గం నుంచి గానీ లేదంటే గుంటూరు పార్లమెంట్ నుంచి గానీ బరిలోకి దిగే అవకాశముందని ఊహాగానాలు చెలరేగాయి. ఆ మేరకు వైఎస్సార్సీపీ అధిష్టానం కూడా రాయుడుకు ‘గ్రీన్‌ సిగ్నల్‌’ ఇచ్చిందని, అందుకే అతడు గ్రౌండ్‌ వర్క్‌ కూడా చేసుకుంటున్నట్టు వార్తలు వెలువడ్డాయి.
 
‘కుల సమీకరణాలకు’ పెట్టింది పేరైన ఆంధ్రా రాజకీయాల్లో ప్రభావశక్తిగా ఉన్న కాపు కులానికి చెందిన రాయుడు చేరికతో అటు పార్టీతో పాటు వ్యక్తిగతంగా రాయుడుకూ కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. రాయుడు వైఎస్సార్సీపీలో చెరగానే పొన్నూరు టికెట్‌ కన్ఫమ్‌ అయిందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది.
 
రాయుడుకు పొన్నూరు టికెట్‌ ఖాయమైందని వైఎస్సార్సీపీ నేతలు చెప్పుకుంటున్నా అధిష్టానం మాత్రం అతడిని పార్లమెంట్‌కు పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. పొన్నూరులో ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఎమ్యెల్యేగా కిలారి వెంకట రోషయ్య ఉన్నారు.  టికెట్ విషయంపై వైఎస్సార్‌సీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతోనే రాయుడు తప్పుకున్నట్లు అర్థమవుతోంది.
 
పొలిటికల్ ఇన్నింగ్స్‌లో సిక్స్‌లు బాదుతాడని భావించిన రాయుడు హిట్ వికెట్‌గా డకౌటయ్యారని కామెంట్ చేస్తున్నారు. రాయుడి నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవంక ఏపీలో  మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కూడా రాయుడు మరోసారి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. 
 
అధికార పార్టీపై అసంతృప్తి, టీడీపీ – జనసేన పొత్తు, కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ షర్మిల చేరికతో అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ అతడిని బుట్టలో వేసిందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. క్రికెట్‌ కెరీర్‌లో ‘రాజకీయాలకు బలైన’ రాయుడు.. పొలిటికల్‌ కెరీర్‌లో మాత్రం అలా కావడానికి వీళ్లేదని వెనుకడుగు వేశారని కూడా భావిస్తున్నారు.  ఇక సోషల్‌ మీడియాలో మాత్రం రాయుడు జనసేనలో చేరుతున్నాడని, పొన్నూరు నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది.