ఆరు గ్యారంటీలతో తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్. రానున్న వంద రోజుల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, చేయూత, యువ వికాసం, ఇందిమ్మ ఇండ్లు అనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికార పార్టీ నేతలు అంటున్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలకు ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే వీటిపై ప్రజల్లో కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
గ్యారంటీల దరఖాస్తుకు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేస్తున్నారు. దరఖాస్తు పత్రాల్లోనూ రేషన్ కార్డు నంబర్‌ను పొందుపర్చాలని స్పష్టం చేయడంతో రేషన్ కార్డు లేని లక్షలాది మంది అర్హుల్లో ఈ పథకాలను పొందలేమోననే ఆందోళన మొదలైంది. తెలంగాణలో గత ఏడేళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ అవ్వలేదు. రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులు కూడా పెండింగ్ లో ఉన్నాయి.
రేషన్ కార్డులకోసం దాదాపు 10 లక్షల మంది దరఖాస్తులు చేసుకొని సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారికి ఎలా అవకాశం కల్పిస్తారని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ అనంతరం గ్యారంటీలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరుతున్నారు.
కొత్త రేషన్ కార్డులు ఇప్పుడే ఇవ్వమని, ప్రజా పాలనలో వచ్చే దరఖాస్తుల పరిశీలన తర్వాతనే అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెల్లరేషన్ కార్డులు ఉన్నా, లేకున్నా దరఖాస్తులు చేసుకోవాలని చెబుతూ ఇపుడు వచ్చే దరఖాస్తుల్లోని డాటా ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ఇస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహితం రేషన్ కార్డు పధకాల అమలుకు అడ్డం కాదని, రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని అంటూనే రేషన్ కార్డు లేనివారిని పధకాలు అమలు చేయడం కష్టం అవుతుందని చెబుతున్నారు. అంటే ముందుగా కొత్త రేషన్ కార్డుల జారీ గురించి ప్రభుత్వం వద్ద నిర్దిష్టమైన ప్రణాళిక, సంసిద్ధత లేన్నట్లు స్పష్టం అవుతుంది.
రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో లబ్దిదారుల సంఖ్య తగ్గించుకునేందుకు రేషన్ కార్డు అర్హత పెట్టారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఉపాధి కోసం పట్టణాలకు వచ్చిన వారి ఆధార్ అడ్రస్ లు గ్రామాలవే ఉన్నాయి. ఈ తరుణంలో పట్టణాల్లో సంక్షేమ పథకాలకు వారిని అర్హులుగా పరిగణిస్తారా? లేదా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చి, అద్దె ఇంట్లో ఉంటున్న చాలా మంది అర్హులకు రేషన్ కార్డులు లేవు. కొత్త రేషన్ కార్డుల జారీపై స్పష్టత లేకపోవడంతో తమని గ్యారంటీలకు అర్హులుగా పరిగణిస్తారా? లేదా? అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తం అవుతుంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటించింది. ఈ గ్యారంటీ అమలుకు రేషన్ కార్డు అర్హత పెడతారా? అనే సందేహం ప్రజల్లో ఉంది. ఢిల్లీ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుంది. అక్కడ రేషన్ కార్డు అర్హత లేకుండా ఎవరైనా సరే 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదు. తెలంగాణలో కూడా ఇదే తరహాలో అమలు చేయాలని కోరుతున్నారు.
వీటితో పాటు రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ప్రతి నెల రూ.2500 ఆర్థిక సాయం, రైతు భరోసా కింద రూ.15 వేలు, నిరుద్యోగ భృతి, చేయూత కింద రూ.4 వేల పింఛన్…ఇలా ప్రతి గ్యారంటీపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా పధకాలను ఏవిధంగా అమలు జరుపుతారో అన్న విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు.
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే పంట పెట్టుబడి సహాయం క్రింద రైతుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి నెల రోజులు కావస్తున్నా రైతుబంధు నిధుల గురించి ఊసెత్తడం లేదు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామన్న నేతలు ఇంకా ఆ ప్రస్తావన తీసుకు రావడం లేదు.
పధకాల అమలుకు సంబంధించి అధికారిక నిబంధనలు విడుదల చేయకుండా ముందుగా దరఖాస్తులు స్వీకరించడం చూస్తుంటే ప్రజల దృష్టి మళ్లించడం కోసమే అనే అభిప్రాయం కలుగుతుంది. ముందుగా దరఖాస్తులు తీసుకొని, ఏమేరకు ఆర్థిక భారం మోయాల్సి వస్తుందో అంచనా వేసుకొని, ఆ తర్వాత వీలయినంత భారం తగ్గించుకునేందుకు దారులు వెదుక్కునే విధంగా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.
పైగా, ఫారంలో బ్యాంకు అకౌంట్ నంబర్ నమోదుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో నగదు బదిలీ పథకాలు ఎలా అమలు చేస్తారంటూ అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహిళలకు ప్రతి నెలా రూ.2500 సాయంపై స్పష్టత లేదు. ఒక ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అందరికీ రూ.2500 ఇస్తారా? లేక ఒక్కరికే ఇస్తారా? భర్తకు పింఛన్ వస్తే భార్యకు ఇవ్వ రా? రేషన్‌కార్డుల్లో తల్లీకూతుళ్ల పే ర్లుండి, కూతురి పెళ్లయిపోతే అత్తగారింటి వద్ద మహాలక్ష్మి డబ్బులు జమ చేస్తారా? లేక తల్లిగారింటి వద్ద దరఖాస్తు చేసుకోవాలా? అన్న ప్రశ్నలు వినిపించాయి.
ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వితంతు తదితర పెన్షన్ తీసుకుంటున్న మహిళలకు కూడా అదనంగా 2500 ఇస్తారా? లేక ఏదైనా ఒక్క పెన్షన్ మాత్రమే ఇస్తారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. దరఖాస్తు ఫారాలను ప్రజలకు అధికారులు ఉచితంగా ఇవ్వాలని, వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అయితే, ఈ కార్యక్రమంలో తొలిరోజే అనేక చోట్ల గందరగోళం నెలకొంది. చాలాచోట్ల దరఖాస్తు ఫారాల కొరత ఏర్పడింది. ఇదే అదనుగా జిరాక్స్ సెంటర్ల యజమానులు ఒక్కో దరఖాస్తు ఫారం జిరాక్స్ తీసేంకు రూ.30 నుంచి రూ.100 వరకు కూడా వసూలు చేశారు.
మరోవంక, రేషన్ కార్డు ఉంటేనే రైతుభరోసా అందనున్నదా? పెట్టుబడి సాయానికి పరిమితి విధించే దిశగా కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తున్నదా? గరిష్ఠంగా 7.5 ఎకరాలకే పెట్టుబడి సాయం అందజేయనున్నదా? రేషన్ కార్డు లేకపోతే పెట్టుబడి సాయం రాదా? అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు