కేజ్రీవాల్‌ అరెస్ట్‌ ప్రచారాన్ని కొట్టిపారేసిన ఈడీ!

ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కొట్టిపారేసింది. అవన్నీ వట్టి వదంతులేనని ఈడీ వర్గాలు స్పష్టం చేశాయి. కేజ్రీవాల్‌ ఇంటిపై దాడులు చేయాలని, సోదాలు నిర్వహించాలన్న ప్రయత్నాలు ఏమీ లేవ వెల్లడించాయి. 
కాగా, గురువారం ఉదయం కేజ్రీవాల్‌ ఇంటిపై ఈడీ దాడులు చేయనుందని, అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంటారని మంత్రులు అతిశి, సౌరభ్‌ భరద్వాజ్‌తోపాటు ఆప్‌ నేతలు ఎక్స్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈడీ వర్గాల నుంచి తమకు సమాచారం ఉందని బుధవారం రాత్రి వరుస ట్వీట్లు చేశారు.

‘అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో గురువారం ఉదయం ఈడీ దాడి చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి’ అంటూ బుధవారం రాత్రి 11.50 గంటలకు మంత్రి అతిశి ట్వీట్ చేశారు. రెండు నిమిషాల తర్వాత మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇదే విషయాన్ని హిందీలో పోస్ట్ చేశారు. ఈడీ గురువారం ఉదయం కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంటుందని, ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

అయితే ఇదంతా వట్టిదేనని ఈడీ వర్గాలు వెళ్లడించాయి. విచారణకు రాలేనంటూ కేజ్రీవాల్‌ రాసిన లేఖను పరిశీలిస్తున్నామని తెలిపాయి.ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణకు హాజరు కావాలని మూడు సార్లు ఇడి కోరినప్పటికి కేజ్రీవాల్ నిరాకరించారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా  ఉన్నామని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

మద్యం కుంభకోణం కేసులో విచారణ రావాలని సిఎం కేజ్రీవాల్‌కు ఇడి మూడు సార్లు సమన్లు జారీ చేసింది. నవంబర్ 2, డిసెంబర్21, జనవరి 3వ తేదీని హాజరు కావాలని ఇడి ఆదేశాలు జారీ చేసినప్పటికి కేజ్రీవాల్ నిరాకరించారు. నిబంధనల ప్రకారం ఆయనపై ఎప్పుడైనా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశంతో పాటు అరెస్టు కూడా చేయవచ్చు.

తాజాగా, ఈడీ సమన్లపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తలమునకలై ఉన్నానని, రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున విచారణకు రాలేనని తెలిపారు. ఈడీ తాను అడగాల్సిన ప్రశ్నలను పంపితే సమాధానం ఇవ్వడానికి గానీ, అవసరమైన పత్రాలు సమర్పించడానికి గాని తాను సిద్ధంగా ఉన్నానని లేఖ రాశారు. 

అసలు తనను విచారణకు పిలవడానికి నిజమైన కారణం, పరిధి, స్వభావం, ఉద్దేశం తెలియజేయాలంటూ గతంలో రాసిన లేఖలపై దర్యాప్తు సంస్థ స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  మద్యం కుంభకోణం కేసులో తనని సాక్షిగా పిలుస్తున్నారా? లేదా అనుమానితుడిగా పిలుస్తున్నారా? అనేది తెలియాల్సి ఉందని పలుమార్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు.

కాగా, అరవింద్ కేజ్రీవాల్ భయపడడం ఏంటని బిజెపి నేతలు విస్మయం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఆయన విడిచిపెట్టాడా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఈడీ సమన్లను దాటవేసే బదులు ఇండియా కూటమి నాయకులు అవినీతిలో పాఠాలు నేర్చోకోవాలని హితవు చెప్పారు.

ఇలా ఉండగా, కేజ్రీవాల్ సమాధానాన్ని ఈడీ వర్గాలు పరిశీలిస్తున్నారని, తిరిగి మరోమారు ఆయనకు సమన్లు జారీచేయవచ్చని తెలుస్తున్నది. మరోవంక, కేజ్రీవాల్ ఇంటికి వెళ్లే అన్ని మార్గాలను మూసేసిన్నట్లు ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.  ఈడీ విచారణను ఎగ్గొట్టిన క్రేజివాల్ శనివారం మూడు రోజుల గుజరాత్ పర్యటనకు బయలుదేరుతున్నారు.