కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ ఉగ్రవాదిగా ప్రకటన

కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్  గోల్డీ బ్రార్‌ ఉగ్రవాదిగా ప్రకటన

కెనడాలో నివాసం ఉంటున్న గ్యాంగ్‌స్టర్ సత్వీందర్ సింగ్ అలియాస్ సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 ప్రకారం ఉగ్రవాదిగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం  ప్రకటించింది. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్న గోల్డీ బ్రార్ నిషేధిత ఖలిస్థానీ కి చెందిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధం కలిగి ఉన్నాడు.

ముఖ్యంగా,  బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ను భారత్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.  గోల్డీ బ్రార్‌కు సీమాంతర ఉగ్రవాద సంస్థల మద్దతు ఉందని, అతను పలు హత్యలలో పాలుపంచుకున్నాడని, జాతీయవాద అనుకూల నాయకులకు బెదిరింపు కాల్‌లు చేయడం, డబ్బు డిమాండ్ చేయడం, హతమారుస్తామని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేయడం వంటి రాడికల్ భావజాలాన్ని ప్రకటించాడని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

సరిహద్దు అవతల నుండి డ్రోన్ల ద్వారా హై-గ్రేడ్ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి మరియు పేలుడు పదార్థాల అక్రమ రవాణాలో గోల్డీ బ్రార్ పాలుపంచుకున్నాడని, హత్యలు చేయడానికి షార్ప్ షూటర్లకు సరఫరా చేస్తున్నాడని తెలిపింది. అతను, అతని సహచరులు పంజాబ్ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి కుట్ర పన్నుతున్నారని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

 ఫ్రాన్స్‌లోని లియోన్‌లోని ఇంటర్‌పోల్ సెక్రటేరియట్ జనరల్ (ఇపిఎస్జీ) అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. డిసెంబర్ 2022లో, గోల్డీ బ్రార్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అతనిపై రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ అయింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య సమయంలో గోల్డీ బ్రార్ పేరు ప్రచారంలోకి వచ్చింది.

తదనంతరం, రాపర్ హనీ సింగ్ నుండి రూ. 50 లక్షలు డిమాండ్ చేయడం, ప్రాణనష్టానికి దారితీసే ముఠా సంబంధిత హింసాత్మక ఘర్షణలో పాల్గొనడం, పాకిస్తాన్ నుండి భారత్‌లోకి ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడం వంటి పలు కేసుల్లో గోల్డీ బ్రార్ పేరు బయటపడింది.

విదేశాల్లో ఉంటూ భారతదేశంలో నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఈ సంఘటనలు నిర్ధారించాయి. ఈ సంఘటనల తరువాత, గోల్డీ బ్రార్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ సంఘటనలకు బాధ్యత వహిస్తూ ప్రకటనలు చేసాడు.  పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్,  గోల్డీ బ్రార్ మధ్య స్నేహం చాలా లోతైనది. లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉండగా, గోల్డీ స్వేచ్ఛగా విదేశాల్లో తిరుగుతున్నాడు.

గోల్డీ బ్రార్ వాస్తవానికి పంజాబ్‌లోని శ్రీ ముక్త్‌సర్ సాహిబ్‌కు చెందినవాడు.  అతను 1994లో జన్మించాడు. అతని తండ్రి పోలీసు ఇన్‌స్పెక్టర్, కానీ గోల్డీ స్వయంగా నేర జీవితంలో పాలుపంచుకున్నాడు. గోల్డీ బంధువు గుర్లేజ్ బ్రార్ హత్య తర్వాత, అతను నేర జీవితాన్ని ఎంచుకున్నాడు. అప్పటి నుండి, అతను అనేక సంఘటనలలో చిక్కుకున్నాడు.  గోల్డీ స్టూడెంట్ వీసా పొంది కెనడాకు పారిపోయాడు.