హత్యాయత్నం కేసులో ప్రైవేట్ యూనివర్శిటీ విసి అరెస్ట్‌

హత్యాయత్నం కేసులో ప్రైవేట్ వ్యవసాయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో ఆయనను జైలుకు తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు తనపై కాల్పులు జరిపి హత్యాయత్నానికి పాల్పడినట్లు బీజేపీ మాజీ నేత దివాకర్‌నాథ్‌ త్రిపాఠి ఆరోపించాడు. 
 
ఆదివారం ఉదయం మార్నింగ్‌ వాక్‌ తర్వాత తన వాహనంలో తిరిగి వెళ్తుండగా శామ్ హిగ్గిన్‌బాటమ్‌ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్, టెక్నాలజీ అండ్ సైన్సెస్ వీసీ రాజేంద్ర బిహారీ లాల్‌ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆయన వెంట ఉన్న ఇద్దరు వ్యక్తులు గన్‌తో తనపై కాల్పులు జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
లాల్‌పై గతంలో తాను పలు కేసులు నమోదు చేయడంతో ఆ కక్షతో తనను చంపేందుకు వారు ప్రయత్నించినట్లు ఆరోపించాడు.  కాగా, బీజేపీ మాజీ నేత దివాకర్‌నాథ్‌ త్రిపాఠి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. వీసీ రాజేంద్ర బిహారీ లాల్‌, మరో ఇద్దరిపై హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆయనను అరెస్ట్‌ చేయడంతోపాటు రిమాండ్‌ నిమిత్తం జైలుకు తరలించారు. ప్రయాగ్‌రాజ్, లక్నో, హమీర్‌పూర్, ఫతేపూర్‌, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లో అక్రమ మత మార్పిడి వంటి పలు ఆరోపణల కింద లాల్‌పై 26 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.