జనవరి 22న అన్ని ఇళ్లల్లో దీపాలు వెలిగించాలి

జనవరి 22న అన్ని ఇళ్లల్లో దీపాలు వెలిగించాలి
జనవరి 22వ తేదీన అయోధ్య భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులందరూ తమ ఇళ్లల్లో దీపాలను వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆ రోజు అయోధ్యకు రావాలని ప్రణాళికలు వేసుకోవద్దని, దాని వల్ల శ్రీరాముడికి ఇబ్బంది తలెత్తుతుందని హెచ్చరించారు.
 
ప్రధాని శనివారం అయోధ్యలో మహర్షి వాల్మీకివిమానాశ్రయాన్ని,  ఆధునీకరించిన రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, దేశ ప్రజలు జనవరి 22న తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించాలని కోరారు. జనవరి 22వ తేదీన అయోధ్య భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యకు రావాలన్న ఆలోచన ఉంటే, విరమించుకోవాలని కోరారు. 
 
‘‘జనవరి 22న ప్రారంభోత్సవం విజయవంతంగా ముగిసిన తరువాత, జనవరి 23 నుంచి ఎప్పుడైనా బాల రాముడిని దర్శించుకోవడానికి మీరు అయోధ్యకు రావచ్చు. ఒకవేళ 22న భారీగా ప్రజలు తరలివస్తే, భద్రతా కారణాల వల్ల అందరికీ వసతి కల్పించడం సాధ్యం కాదు. ఆ శ్రీరాముడికి ఇబ్బంది కలుగుతుంది’’ అని ప్రధాని మోదీ వివరించారు.

‘‘జనవరి 22న అయోధ్యకు రావడానికి బదులుగా ఇంట్లో దీపం వెలిగించండి. ఆ రోజు భారతదేశం అంతటా మరోసారి దీపావళి జరగాలి” అని ప్రధాని మోదీ సూచించారు. ఈ మహత్తర కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఏళ్ల తరబడి జరుగుతున్నాయని, అందువల్ల ఆ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు, భారతదేశంలోని అన్ని దేవాలయాల ప్రాంగణాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రధాని మోదీ కోరారు. ‘‘శ్రీరాముడు యావత్ దేశానికి చెందినవాడు. ఇప్పుడు ఆయన వస్తున్నారు కాబట్టి చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ దేవాలయమూ మురికిగా ఉండకూడదు’’ అని ప్రధాని మోదీ తెలిపారు.

అయోధ్య నగరాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మార్చాలని నగర ప్రజలను ప్రధాని మోదీ కోరారు. అయోధ్య ధామ్ లో ఎక్కడ చూసినా రామనామం వినిపించాలని సూచించారు. అయోధ్యలో అన్ని వసతులతో టౌన్ షిప్ లు నిర్మిస్తున్నామని చెబుతూ అయోధ్యలో రద్దీ మేరకు రహదారులు విస్తరిస్తామని హామీ ఇచ్చారు. అయోధ్యలో 4 కోట్ల మంది నివసించేలా అన్ని సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు.